నర్సాపూర్, జనవరి 16: ఆరు గ్యారంటీలు, ఇచ్చిన అనేక హామీలపై ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్మే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై అన్యాయంగా, అక్రమంగా ఫార్ములా ఈ-రేసింగ్ కేసు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు 1992లో ఈ కార్ రేసింగ్‌ను రాష్ర్టానికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నం చేసి విఫలమయ్యారని, కానీ.. కేటీఆర్ కృషితో ఈ-రేసింగ్ కేసు పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యిందన్నారు.
రేస్ నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ర్టానికి రూ. 700 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 13 నెలల తర్వాత కావాలనే ఫార్ములా ఈ-రేసింగ్ ప్రాసెస్‌ని తప్పుగా చూపించి కేటీఆర్‌పైన కేసును బనాయించిందన్నారు. ఇందులో రూ.55 కోట్లు ప్రభుత్వం పరంగా ఇచ్చామని అధికారులే చెబుతున్నారని, అక్కడ నిర్వాహకులు కూడా ప్రభుత్వం నుంచి తమకు డబ్బులు అందాయని స్పష్టంగా చెప్పారని, ఇందులో ఎక్కడ అవినీతి ఉందని ప్రశ్నించారు. మళ్లీ ఈ-రేసింగ్ నిర్వహిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని రద్దు చేసి తెలంగాణకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిందని విమర్శించారు. ఈవెంట్ రద్దుతో రాష్ట్ర ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేలా, పారిశ్రామిక వేత్తలు రాష్ర్టానికి రావాలంటేనే భయపడేలా వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, సంతోష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్, ఆంజనేయులుగౌడ్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.