పటాన్చెరు, జనవరి 23: పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణులు వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గురువారం పటాన్చెరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆం దోళనకు దిగారు. ఆగ్రహంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చొచ్చుకుని వెళ్లి కుర్చీలను పోలీసుల సాక్షిగా నుజ్జునుజ్జు చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి గూడెం మహిపాల్‌రెడ్డి డౌన్డౌన్తో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు. గ్రూపులుగా విడిపోయి అలజడిని సృ ష్టించి పోలీసులకు టెన్షన్ పెట్టించారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కొద్దిరోజులుగా గూడెంపై గుర్రు…
తమను పట్టించుకోవడం లేదని కొద్దిరోజులుగా కాంగ్రెస్ శ్రేణులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. గురువారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్ వద్దకు అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివచ్చారు. పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్ర హం వద్ద సమావేశమై ఎమ్మెల్యే తీరుపై చర్చించుకుని ఆయనపై మండిపడ్డారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులనే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాడని పేర్కొన్నారు. సీఎం ఫొటో ఆయన కార్యాలయంలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామసభలకు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులను పిలవడం లేదన్నారు. అన్నింట్లోను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై అదిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చే యాలని కోరారు. ఎమ్మెల్యే తీరుతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయిద్దామని పిలుపునిచ్చారు. దీంతో కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జాతీయ రహదారిపై ఫ్లకార్డులతో బైఠాయించారు. గూడెం మహిపాల్‌రెడ్డి డౌన్డౌన్తో పాటు కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు.
పోలీసులు కాంగ్రెస్ నాయకులను ధర్నా విరమింపజేసేందుకు ఎంతగా ప్రయత్నించినా కార్యకర్తలు తమపట్టు వదలలేదు. పైగా కొంద రు కార్యకర్తలు రోడ్డుకు మరోవైపుగా వెళ్లి ఎమ్మెల్యే గూడెం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారివద్ద ఉన్న దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్ర యత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి పోలీసులు వారివద్ద నుంచి దిష్టిబొమ్మను లాకెళ్లి వారి ప్రయత్నం భగ్నం చేశారు. అంతలోనే ఆగ్రహంతో ఉన్న మరికొందరు నాయకులు, కార్యకర్తలు నేరుగా జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికే అప్రమత్తమైన క్యాంప్ కా ర్యాలయ సిబ్బంది గేట్లను మూసివేయడంతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు మహిపాల్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ టెన్షన్ సృష్టించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు గోడదూకి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలోని కుర్చీలను బయటకు పారవేశారు. మరికొందరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆఫీసులోకి దూరి సీఎం రేవంత్ చిత్రపటాన్ని అక్కడ పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు క్యాంప్ ఆఫీసు రక్షణకు రంగంలో దిగి ఆగ్రహంలో ఉన్న కార్యకర్తలను బయటకు పంపించారు. బయటకు తెచ్చిన కుర్చీలను కార్యకర్తలు విరగ్గొట్టి నుజ్జునుజ్జు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల వీరంగాన్ని ఆపడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. పలువురు సీఐలు, ఎస్ఐలు క్యాంప్ ఆఫీసుకు తరలివచ్చి పోలీసు సిబ్బంది సాయంతో వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్ శ్రేణుల గొడవలు పటాన్చెరులో టెన్షన్ సృష్టించింది.