సిద్దిపేట, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ గుర్తింపుగా, సంక్షేమ పథకాల అమలుకు కీలక ఆధారంగా ఉండాల్సిన రేషన్ కార్డుల్లో కుటుం బ సభ్యుల పూర్తి వివరాలు, ఫొటోలు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి చెందిన ఎవరు కార్డుదారు, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారికి ఏయే సరుకులు అందాలి అనే ప్రాథమిక సమాచారం కార్డుపై స్పష్టంగా కనిపించకపోవడంపై ఈ కార్డుల ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉండటం విమర్శలకు దారితీస్తోంది. రేషన్ కార్డుకు రాజకీయ ప్రచార రంగు పులమడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రేషన్ కార్డు అనేది ప్రజల హకులు, కుటుంబ వివరాలు ప్రతిబింబించే అధికారిక పత్రంగా ఉండాలే తప్పా పాలకుల ప్రచార సాధనంగా ఉండకూడదంటున్నారు. గతంలో రేషన్ కార్డు కేవలం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా పలు సందర్భాల్లో కుటుంబ వివరా లు తెలియజేసే ప్రభుత్వ పత్రంగా ప్రజలు ఉపయోగించుకునేవారు. కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర ప్రాథమిక వివరాలు కార్డులో ఉండటంతో అవసరమైన సందర్భాల్లో ఆకార్డు కుటుంబానికి సంబంధించిన ఒక ఆధారంగా ఉపయోగపడింది. ప్రస్తు తం అందజేస్తున్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలు వంటి వివరాలు స్పష్టంగా లేకుంటే భవిష్యత్‌లో ఈ కార్డును గుర్తింపు పత్రంగా ఎలా పరిగణిస్తారన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహా చిన్న పరిమాణంలో ఉండటంతో సులభంగా తీసుకువెళ్లేందుకు అనుకూలంగా ఉన్నాయని ప్రభు త్వం చెబుతోంది. అందులో అవసరమైన సమాచారం లేకపోతే చిన్న పరిమాణంతో ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సానర్తో కార్డు సాన్ చేసినప్పటికీ అవసరమైన వివరాలు అందడం లేదు. డిజిటల్ కాలంలో కార్డుకు సంబంధించిన సమాచారాన్ని సాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు స్థితి, సరుకుల కేటాయింపు తదితర సమాచారం అందుబాటులోకి రావాలి.
కానీ, అలా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందులోని క్యూఆర్ కోడ్ లేదా సానింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసి సంబంధిత సమాచారాన్ని అందించేలా ఉండాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో ఆ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటే కార్డు ఎవరిది అనేది తెలుస్తుంది. రేషన్ కార్డు ప్రధాన ఉద్దేశం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కుటుంబానికి కేటాయించే నిత్యావసర సరుకులు పొందడం. అలాంటప్పుడు కార్డులో కుటుంబానికి ఏయే సరుకులు అందుతాయి, ఎంత పరిమాణంలో అందా లి వంటి ప్రాథమిక వివరాలు ఉంటే కార్డుదారుడికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సిద్దిపేట జిల్లాలో 3,30,697, మెదక్ జిల్లాలో 2,42,353, సంగారెడ్డి జిల్లాలో 4,21,692 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మరో లక్ష వరకు కొత్త కార్డులు మంజూరు చేశారు. ఈనెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు. రెండు మూడు రోజుల నుంచి గ్రామాలకు చేరిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గందరగోళంగా తయారైంది. బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలకు ప్రాధాన్యం ఉండేది. కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధిత సమాచారం కార్డులో ఉండటంతో కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఒకే పత్రంలో కనిపించేవి. ప్రస్తుత కార్డులో ఆ విధంగా లేదు.
ప్రస్తుతం అందజేస్తున్న కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లు కనిపించకపోవడం వల్ల పాత కార్డులు, కొత్త కార్డుల మధ్య తేడాపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కొత్త రూపంలో కార్డు అందిస్తే అందులో మరింత ఉపయోగకరంగా సమాచారం పొందు పర్చాల్సింది పోయి, అవసరమైన వివరాలు లేకుండా స్మార్ట్‌కార్డు ఇవ్వడంతో ప్రజలకు ప్రయోజనం తగ్గిపోయింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్డు రూపొందించాల్సి ఉండగా, కేవలం కాంగ్రెస్ ప్రభు త్వం తమ ప్రచారానికి మాత్రమే వాడుకుంటుంది.

ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోలు లేవు. సీఎం, మంత్రి ఫొటోలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఇచ్చిన రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల ఫొటోతో పాటు కుటుంబ సభ్యులు వివరాలు ఉండేవి. ఎక్కడికి వెళ్లినా రేషన్‌కార్డు ఒక గుర్తింపుకార్డుగా ఉపయోగపడేది. ఇప్పుడు చిన్నగా ఏటీఎం కార్డు లెక్క ఇచ్చిన ఈ కార్డులో ఏం వివరాలు లేవు. దీని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం తిరిగి ఫొటోలు, పేర్లతో రేషన్ కార్డులు అందించాలి.
– ఎండీ గోరిమియా, మద్దూరు (సిద్దిపేట జిల్లా)
ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులో మా అత్తగారింటి పేరుకు బదులు తల్లిగారింటి పేరు పడ్డది. నా ఆధార్‌కార్డులో సైతం అత్తగారింటి పేరు ఉంది. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా అత్తగారింటి పేరు మాత్రమే ఇచ్చినప్పటికీ తల్లిగారింటి పేరుతో రేషన్‌కార్డు వచ్చింది. ఇలా ఉంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. తప్పులు లేకుండా తిరిగి రేషన్‌కార్డులు ఇవ్వాలి. గతంలో ఇచ్చిన రేషన్‌కార్డులో ఎలాంటి తప్పులు లేవు. ఇప్పుడు కొత్తకార్డులని చెప్పి తప్పులతో రేషన్ కార్డు ఇచ్చారు.
– వేల్పుల ప్రీతి, వల్లంపట్ల, మద్దూరు మండలం (సిద్దిపేట జిల్లా)
రేషన్ కార్డులను ప్రభు త్వం తమ ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటు. కుటుంబ సభ్యు ల ఫొటోలకు బదులు సీఎం, మంత్రుల ఫొ టోలు పెట్టడమెందుకు. మొత్తమే కుటుంబ సభ్యుల పేర్లు పెట్టలేదు. కనీసం భర్తల పేర్లు, తండ్రుల పేర్లు కూడా పెట్టలే. ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న ధ్యాస ప్రజలకు ప్రయోజనం కల్పించడం మీద లేదని ఈకార్డుల ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు గుర్తింపుకార్డుగా ఉపయోగపడిన రేషన్‌కార్డు ప్రచారానికి పనికొస్తుందని ఎప్పుడు ఊహించలేదు.ప్రభుత్వం తక్షణమే కుటుంబసభ్యుల పూర్తి వివరాలు, ఫొటోతో సహా కొత్తగా ముద్రించి, జారీచేయాలి.
– నలుగొప్పుల రేణుకారాములుగౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు, ధూళిమిట్ట మండలం(సిద్దిపేట జిల్లా)