సిద్దిపేట. సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహకార సంఘాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుం టున్నాయి. ఇటీవల పలు సొసైటీల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ మూడు విడతల్లో చేయడంతో అసలు గుట్టు రట్టవుతున్నది. రైతులకు తెల్వకుండానే సొసైటీ అధికారులు పంట రుణాలు తీసుకొని సొంతానికి వాడుకున్నారు. రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వచ్చే సరికి అసలు విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల నిర్వహణ, గన్నీబ్యాగులు, పంట రుణాల పంపణీ, లాంగ్ టర్మ్ రుణాలలోనూ సొసైటీ అధికారులు నిబంధనలకు పాతర వేసి ఇష్టానుసారంగా వ్యవహరించి భారీగా అవినీతికి పాల్పడినట్లు అర్థమవుతున్నది. సహకారమా..? స్వాహా పర్వ మా..? అన్న తరహాలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సొసైటీలు తయారయ్యాయి. ఇంత జరుగుతున్నా సంబంధితశాఖ అధికారుల చర్యలు మాత్రం శూన్యం.
ప్రతి సొసై టీ అక్రమాల వెనుక జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇతర పెద్దల హస్తం ఉండడంతో “ఆడింది ఆట పాడిం ది పాట” అన్నట్లుగా తయారైంది. సిద్దిపేట, మెదక్, సం గారెడ్డి జిల్లాల్లోని ప్రతి సహకార సంఘాన్ని పూర్తి స్థాయి లో విచారణ చేస్తే ఆయా సొసైటీల స్కాంలు బయట పడనున్నాయి. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని సొసైటీలపై విచారణ చేపట్టాలని ఆయా సొసైటీల పరిధిలోని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సొసైటీల్లో జరుగుతున్న అవినీతి రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఆయా సొసైటీల సెక్రటరీలు, ఇతర సిబ్బంది కలిసి సొసైటీలను పూర్తిగా అవినీతిమయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో మెదక్ జిల్లాలోని పలు సొసైటీలు, సంగారెడ్డి జిల్లాలోని రెండు, మూడు సొసైటీలు, సిద్దిపేట జిల్లాలోని మూడు నాలుగు సొసైటీల్లో భారీగా అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో సహకార శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆయా సొసైటీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపడుతున్నది.
ఈ విచారణలో పలు ఆసక్తికర విషయా లు బయటకు వస్తున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సహకారశాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నది. డీసీసీబీ పరిధిలోని బ్రాంచీలతో పాటు సహకార శాఖ పర్యవేక్షణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) భారీగా రుణాల గోల్మాల్ జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో 37 సొసైటీల్లో 22,086 మంది రైతులు రూ.212.46 కోట్ల పంట రుణాలు, మెదక్ జిల్లాలో 31 సొసైటీల్లో 29,519 మంది రైతు లు రూ.153.76 కోట్ల పంట రుణాలు, సిద్దిపేట జిల్లా లో 15 సొసైటీల్లో 11,980 మంది రైతులు 85.17 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ఆయా జిల్లాల్లోని సొసైటీల్లో 50శాతం కూడా పంట రుణాలు మాఫీ కాలేదు. మాఫీకాలేని రైతులు సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. సొసైటీ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సొసైటీ ల్లో ఎక్కువగా పంట రుణాలకు సంబంధించినవే ఉం టాయి. వ్యాపారం పెంచుకోవడానికి అధికారులు ఆసక్తి చూపుతున్నారు తప్పితే పంట రుణాల లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పీఏసీఎస్‌లో కొంత మంది అధికారులు అక్రమాల కారణంగా నిధులు దుర్వినియోగమవుతున్నాయి. రైతుల ఖాతాలను ఆధార్ అనుసంధానం చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారు. మాకెందుకు పంట రుణమాఫీ కాలేదంటూ రైతులు అధికారులను అడిగితే సరైన సమాధానం రావడం లేదు.