కొమురవెల్లి, మార్చి 3 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్‌నగర్‌లో ఎండిన పంటలను సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమురవెల్లి మండలం సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో ఉండడంతో ఎప్పుడూ కరువు కాటకాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఈ ప్రాంతంలో తపాస్‌పల్లి రిజర్వాయర్ నిర్మించారన్నారు.
భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి, ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపి పంటలను కాపాడాలని తహసీల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి, మండల కార్యదర్శి తాడూరి రవీందర్, ప్రశాంత్, చక్రపాణి, బాలస్వామి, పరశురాములు, మహేశ్ పాల్గొన్నారు.