గజ్వేల్, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఉదయం సమయంలో సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, చేర్యాల, జనగాం, వేములవాడ, కొమురవెల్ల్లికి వెళ్లేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులు, ప్రయాణికులు, విద్యార్థులు వేచి ఉంటున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రభుత్వ ఉద్యోగులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. సాయంత్రం సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు ఉద్యోగులు, ప్రయాణికులు వందలాదిగా బస్సుల కోసం వేచి ఉంటున్నారు. సిద్దిపేట, కరీంనగర్, హుస్నాబాద్, మంథని, గోదావరిఖని, వేములవాడ డిపోలకు చెందిన బస్సులు వస్తున్నప్పటికీ, సిద్దిపేటలోనే ప్రయాణికులతో కిక్కిరిసి వస్తున్నాయి.
అక్కడి నుంచే ప్రయాణికులు బస్సులో ఒంటికాలుపై నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ రాగానే ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్నారు. బస్సు వద్దకు వెళ్లగానే సిబ్బంది చోటులేదు ఎక్కడ ఎక్కించుకోవాలని ప్రయాణికులతో అంటున్నారు. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌కు వెళ్లేందుకు గజ్వేల్, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, జగదేవ్‌పూర్ ప్రాంతాల నుంచి ఉద్యోగులతో పాటు ప్రయాణికులు ప్రజ్ఞాపూర్ చౌరస్తాకే చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల కోసం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రయాణికులు వేచి ఉండాల్సిందే. వచ్చిన బస్సుల్లో చోటు లేక ఎక్కేందుకు విముఖత చూపిస్తున్నారు.
ఆదివారం, సెలవు రోజుల్లో నాచారం, యాదాద్రి, స్వర్ణగిరికి వెళ్లేందుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రజ్ఞాపూర్ చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో ప్రతిఒక్కరూ బస్సులో సీటు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై అన్ని వర్గాల ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ప్రతి బస్సులో సామర్థ్యానికి మించి ప్ర యాణికులు ఎక్కడంతో కండక్టర్లకు తలనొప్పిగా మారింది. రోజూ హైదరాబాద్‌కు సిద్దిపేట, వేములవాడ, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, దుబ్బాక, హుస్నాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూర్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి.
ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికులకు మాత్రం సీటు దొరకడం పెద్ద సవాల్‌గా మారింది. ఇక పండుగలు, ప్రత్యేక రోజుల్లో తక్కువ బస్సులు తిప్పుతుండడంతో రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు మొత్తం మహిళలతో నిండిపోతున్నాయి. చాలా బస్సుల్లో వెనుక భాగంగా సైతం మహిళలు కూర్చుంటున్నారు. దీంతో పురుష ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో రద్దీతో స్టాపులు రాగానే దిగడానికి ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు.
సామాన్య ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులను ఆశ్రయించక తప్పదు. ఎంత దూరమైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నది. దీంతో బస్సులు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రం బస్సుల్లో కాలు పెట్టి ఎక్కలేని పరిస్థితి నెలకొంటున్నది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే సీటు దొరకడం గగనంగా మారింది. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రయాణం నరకంగా మారుతున్నది.
సాయంత్రం సమయంలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్ లేకపోవడంతో రోడ్డుపైనే గంటల తరబడి వేచి ఉండడంతో సెల్‌ఫోన్ దొంగలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉచుకొని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో అధికారులు బస్సులు నడపాలని కోరుతున్నారు.