తెలంగాణ వీరయోధుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఘన చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో ‘సర్దార్ సర్వాయి పాపన్న- ది రెబల్ కింగ్ ఆఫ్ డెక్కన్’ చిత్రాన్ని తీశామని చిత్ర దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి తెలిపారు. పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తెరకెక్కించిన ఈ యానిమేటెడ్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడారు. ఈ సినిమాలో ఓ చారిత్రక యోధుడి ప్రస్థానంతో పాటు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ఆవిష్కరించామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో గొప్ప వ్యక్తుల జీవితాలు సినిమా ద్వారా కోట్లాది మందికి చేరువయ్యాయని, పుస్తకాలు చదువని వారు కూడా సినిమా ద్వారా చరిత్రను అవగతం చేసుకునే వీలు దక్కుతుందని చెప్పారు.
‘ఏఐ సాంకేతికతను ఉపయోగించినప్పటికీ..కథలో ఎమోషన్ మిస్ కాకుండా చూసుకున్నాం. సర్వాయి పాపన్న పోరాటస్ఫూర్తి, ఆత్మగౌరవం వంటి అంశాలను నేటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాం. చారిత్రక అంశాలు, సాంకేతికత కలబోతగా అద్భుతంగా రూపుదిద్దుకున్న చిత్రమిదని ప్రశంసలొస్తున్నాయి. సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ వెబ్సెట్లలో సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి’ అని వెంకటేష్ గౌడ్ తెలిపారు.