హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య కొండలా పేరుకుపోతున్నది. తాజాగా సుప్రీంకోర్టు విడుదల చేసిన ఇండియన్ జ్యుడీషియరీ వార్షిక నివేదిక 202425 ప్రకారం, 2025 జూన్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.67 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. హైకోర్టు పరిధిలోనే 2.29 లక్షల కేసులు ఉండగా, జిల్లా న్యాయస్థానాల్లో 9.38 లక్షల కేసులు విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా హైకోర్టులో పేరుకుపోయిన మొత్తం కేసుల్లో దాదాపు 32 వేల కేసులు దశాబ్దానికి పైబడి తేలకపోవడం గమనార్హం.
న్యాయవ్యవస్థలో సంసరణలు చేపడుతున్నప్పటికీ న్యాయమూర్తుల కొరత కారణంగా ఏండ్ల తరబడి బాధితులకు సత్వర న్యాయం అందని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు భారీగా ఖాళీగా ఉండటం కేసుల పరిషారానికి ప్రధాన అడ్డంకిగా మారింది. హైకోర్టుకు మొత్తం 42 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం 27 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తులతో పాటు సహాయక సిబ్బంది కొరత కూడా న్యాయవ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతున్నది. హైకోర్టు పరిపాలనా విభాగంలో మొత్తం 1,709 సిబ్బంది పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1,263 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఖాళీల కారణంగా రోజువారీ న్యాయపరమైన రికార్డుల నిర్వహణ, విచారణల ప్రక్రియ మందగిస్తున్నది.
ఒక పక కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోర్టు భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో రాష్ట్ర న్యాయవ్యవస్థ ముందంజలో ఉన్నదని ఇండియన్ జ్యుడిషియరీ వార్షిక నివేదిక ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 20 నూతన అభివృద్ధి ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. వీటి ద్వారా కొత్తగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 61 కోర్టు హాళ్లు, న్యాయాధికారుల కోసం 30 నివాస గృహ సముదాయాలు సిద్ధమవుతున్నాయి. ఆయా నిర్మాణాలతో ప్రజలకు కోర్టులు చేరువగా ఉండి వ్యయప్రయాస భారాలు తగ్గనున్నాయి.
సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ ప్రక్రియలో రాష్ట్రం విశేష పురోగతి సాధించినదని వార్షిక నివేదిక వెల్లడించింది. న్యాయసేవలను కక్షిదారులకు సులభతరం చేసేందుకు హైకోర్టు ప్రత్యేక చొరవతో వివిధ కోర్టు ప్రాంగణాల్లో 99 ఈ-సేవా కేంద్రాలను ప్రారంభించింది. దేశంలోని 25 హైకోర్టులతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసుల భారం మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, తగినంత మంది జడ్జిలను నియమిస్తే కేసుల పరిషారం మరింత వేగవంతం అవుతుందని జ్యుడిషియరీ వార్షిక నివేదిక స్పష్టం చేస్తున్నది.