ఆనందచారి కవిగా ప్రసిద్ధులు. కవిగా ఆయన చేయితిరిగినతనం కథకుడిగా కూడా ఒక పరిణితమైన చేతివాటాన్ని చూపించింది. ఆయన కథల్లో వస్తువు ఎంపిక, కథనం చేసిన తీరు, దాని వెనుక పూసల్లో దారంలా ఆయన వ్యక్తీకరించిన రాజకీయ అభిప్రాయాలు ‘గస్సాల్’ అనే సంపుటి పేర వ్యక్తమైంది. గస్సాల్ కథలు మనిషిలోని సున్నితత్వాన్ని ఆకర్షించిన తీరు గుర్తించదగింది. జీవన వాస్తవికతకు ఆయన కథలు అద్దం పడతాయి. ప్రతిరోజూ మన కండ్ల ముందు కనబడుతూ మన అనుభవంగా నిలిచేవే ఆయన పాత్రలు. చాంద్, సలీమా, సోమ్లా, లచ్చిమి, శేషగిరి, శశి, చెత్తబ్బాయ్, రాణి, ఈశయ్య, ఎస్ఐ, ఆనందరావు, సుభాషిణి, మిత్రా, హరీశ్, వెంకటాచారి కుటుంబం, చేత్తోడు..ఇట్లా మనకు అనుభవానికి వచ్చేవే. దిగువ మధ్యతరగతి, అతి పేదల దైన్యమే కథల రూపం పొందింది.
ఒక ముస్లిం దిగువ వర్గపు కుటుంబం పొందే ఈతి బాధలు, మరణించిన ముస్లింల శవాలను శుభ్రం చేసి అంతిమయాత్ర (గస్సాల్) చేస్తూ జీవించే ఒక కుటుంబం ఆకలి బాధ ఈ కథల్లో మనల్ని కలవరపరుస్తుంది. ఈ దైన్యం మనం చూసిందే. ఎక్కడో మన జీవిత లోనో మన పొరుగు జీవితంలోనో చవిచూసిన యాది ఏదో మనల్ని తాకుతుంటుంది. జీవన సౌందర్యం తెలిసిన ఒక రొట్టెలమ్మే అమ్మ (లచ్చిమి) తన కొడుక్కి తమ బతుకు గురించి అందులో తమకు దొరికే తృప్తి గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
కుమార్తె పెండ్లిని మరో మతం అబ్బాయితో చేయడానికి వ్యతిరేకించే వర్తమాన సమాజంలోని వేలాది తండ్రుల ప్రతినిధి శేషగిరి. వంటింట్లో చెత్తంతా తీసేయాలని అంటున్న ఆ భర్తతో భార్య ఇలా అంటుంది.
‘వంటింట్లోది కాదు. ఈ పురుష స్వామిక మనువాద ప్రపంచపు కులం, మతం చెత్త. ఈ మనుషుల తలల్లో వేల ఏండ్లుగా పేరుకపోయింది. మరీ కంపు కొడుతున్నది. అది పడేస్తేనే సమాజం శుభ్రపడుతుంది’. జీవన వాస్తవికత, దాని పరిష్కారం ఒక స్త్రీ అనుభవం నుంచి మనం చూస్తాం. జెండా వందనం రోజు అంబేద్కర్ విధానాల గురించి యువకుడైన సబ్ ఇన్స్పెక్టర్ ఉపన్యాసం చెప్తాడు. ఆదర్శాలు చెప్పిన ఆ అధికారి ఒక దళిత మహిళను హింసించి లాకప్ డెత్ చేస్తాడు.
ఈనాటికీ క్రూరత్వానికి రంగస్థలాలుగా నిలిచిన పోలీస్స్టేషన్ల పరిస్థితి ఇది. ఎప్పుడూ మాట్లాడే ఆనందరావును ఆకస్మాత్తుగా కోల్పోయిన ఒక ఒంటరి సుభాషిణి కథ మానవ మనస్తత్వంలో ఉండే కనిపించని కోణాలను బహిర్గతం చేస్తుంది. మతాలు వేరైనా వేషాలు మార్చి భిక్షాటన చేసే జాన్ బీ, వరలక్ష్మి, సరోజ, వాళ్లకు సహాయం చేయడం కోసం ప్రతి గురువారం సత్యసాయి గుడికి పరిగెత్తుకు వెళ్లే డాక్టర్ను ఈ కథల్లో చూస్తాం. పరంపరాగతంగా వచ్చే వృత్తుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఆచూకీ లేని హత్యగా పరిణమిస్తాయో ఈ కథలో తెలుస్తుంది. చేతివృత్తులు ధ్వంసం కాగా, బతికే దారి లేక ఈ లోకాన్ని విడిచిపెట్టే వెంకటాచారి, సరోజిని లాంటి దంపతుల ధైన్యం హృదయాల్ని కదలిస్తుంది. పౌరసత్వ చట్ట సవరణ వల్ల దెబ్బతింటున్న ఒక ముస్లిం కుటుంబం దీనగాధ ‘హిందూ సితా హమారా’.
చిరకాలంగా ఇక్కడే నివసిస్తున్న కుటుంబం ఒకవేళ ప్రభుత్వానికి అనుమానం వస్తే తాము ఇక్కడి వాళ్లమేనని తామే నిరూపించుకోవాలని చెప్పడం అనేక ఇబ్బందులకు దుఃఖానికి దారితీస్తుంది. ఆధునిక యాంత్రికత వల్ల బాగా చలించి బలైపోయిన ఊర్వశి చివరికి జీవితం మీద విసుగుతో స్లీపింగ్ పిల్స్ మింగడం లుప్తమైపోతున్న మానవ సంబంధాలకు సంకేతం. సాధారణంగా కథారచనకు ఒక ప్లాటుని ఎన్నుకోవడం, దాన్ని శిల్పసమన్వితం చేయడం ప్రాథమికంగా రచయిత చేసే పని. అలాకాకుండా సజీవమైన భిన్న అనుభవాల నుంచి, కన్నీటి వెతలనే కథలుగా మలిచారు రచయిత ఆనందచారి. ఈ కథలు కేవలం ప్రతీకలు మాత్రమే. నిజమైన వస్తువు కన్నీళ్లే. అతి కఠినమైన వాస్తవ జీవితాలే. చుట్టూ ఉన్న సామాజిక వాస్తవికతలను ఇష్టపడేవారు తప్పకుండా ఈ కథలు చదవాలి.
డా.కాంచనపల్లి
గోవర్ధన్రాజు
9676096614