తొగుట, జనవరి 25: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్లారెడ్డిపేటలో పంచాయతీ, పెద్దమాసాన్‌పల్లిలో రైతువేదిక, పంచాయతీ, వాటర్‌ట్యాంక్, వర్ధరాజ్‌పల్లిలో పంచాయతీ, ముదిరాజ్ సంఘం భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గౌడ సంఘం భవనానికి శుంకుస్థాపన చేశారు. గుడికందులలో మురికికాల్వల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, గౌడ సంఘం భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారన్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో ఏనాడూ సాగు, తాగునీటికి, కరెంటుకు లోటు రాలేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చేస్తే మల్లన్న సాగర్ జలాలు కాల్వల పొంటి పారేవన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసినా కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయలేదన్నారు.
మల్లన్న సాగర్ ప్రధాన కాల్వకు సైతం మంత్రి కొండా సురేఖ రాత్రిళ్లు వెళ్లి నీటిని విడుదల చేసి స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి సాగునీటి గోస తప్పిందన్నారు. ఎల్లారెడ్డిపేట, పెద్దమాసాన్‌పల్లి, వర్ధరాజ్‌పల్లి, గుడికందుల గ్రామాల్లో దేవాలయాల్లో పూజలు చేశారు. వర్ధరాజ్‌పల్లిలో సంతోష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. గుడికందుల జడ్పీహెచ్ఎస్లో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. మల్లన్న సాగర్ ప్రధాన కాల్వను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ కొమురయ్య, కంది రాంరెడ్డి, సర్పంచ్‌లు గోవర్ధన్‌రెడ్డి, జ్యోతిమల్లారెడ్డి, ఎల్లం, వరలక్ష్మీ స్వామి, మల్లయ్య, రాజవ్వ, రేణుక నర్సింహులు, ఎంపీటీసీలు స్వామి, సుమలతా కనకయ్య, శరత్, మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.