మెదక్ మున్సిపాలిటీ, మార్చి 29 : పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు తాజా కూరగాయలు, మాంసం, పండ్లు, పూలు అన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయలు, పండ్లు, మాంసం ఒకేచోట విక్రయించేందుకు ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నది. మెదక్ జిల్లాలో మెదక్‌తోపాటు నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా మెదక్ మున్సిపాలిటీలో సిద్దిపేట, గజ్వేల్ తరహాలో ఆధునాత సదుపాయలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.4.50 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రెండున్నర ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్స్ డెవలప్మెంట్ ద్వారా నిధులు మంజూరయ్యాయి. గతేడాది మేలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్‌లో టెండర్ ప్రక్రియ ముగిసింది. ఇటీవల మంత్రి హారీశ్‌రావు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టెండర్ దక్కించుకున్న జీఎస్కే సంస్థ పనులు ప్రారంభించింది.
పట్టణంలోని ప్రస్తుత మార్కెట్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టణ విస్తీరణ పెరగడంతో పాటు జనాభా సైతం పెరగడంతో నిజాం కాలం నుంచి కొనసాగుతున్న మార్కెట్‌తో పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మార్కెట్లో సరైన సౌకర్యాలు, పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం, రోడ్లపైకి వచ్చి అమ్మకాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. వీటన్నింటికి పరిష్కారం చూపే దిశగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నిర్మాణమవుతున్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం 25 వేల లోపు జనాభా గల పట్టణాల్లో ఎకరం స్థలంలో రూ.2 కోట్లతో, 25 వేల జనాభా కంటే అధికంగా ఉంటే రెండెకరాల స్థలంలో సమీకృత మార్కెట్‌ను నిర్మించేందుకు రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్ మున్సిపాలిటీలో 25 వేలకు పైగా జనాభా కలిగి ఉన్నందున రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. 25వేల లోపు జనాభా గల మున్సిపాలిటీలు రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు రూ.2కోట్లు చొప్పున నిధులు మంజూరు చేసింది. రామాయంపేటలో ఇటీవల ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్‌కు స్థలం ఖరారయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభు త్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్కెట్లో ఒక దుకాణం కచ్చితంగా 64 చదరపు అడుగుల విస్తీర్ణంలో పొడవు, వెడల్పు సమానంగా ఉండేలా నిర్మించాలని స్పష్టం చేసింది. మార్కెట్లో కూరగాయలు, చికెన్, మటన్, చేపలతో పాటు పూ లు, పండ్ల అమ్మకాలు జరిగేలా, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం, అన్లోడింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ముఖ్యం గా మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయ్లెట్ల సదుపాయం ఉండాలని స్పష్టం చేసింది. మార్కెట్లో రాత్రి సమయంలో ఇబ్బందులు కలుగకుండా లైటింగ్ ఉండాలని సూచించింది. పచ్చదనం కోసం మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రత్యేకంగా కార్యాయం సైతం ఉండాలని సిద్దిపేట, గజ్వేల్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తయితే సమస్యలు పరిష్కారమవుతాయి. రోైడ్లపై కూరగాయలు అమ్మడానికి వీలుండదు. ఒకేచోట కూరగాయలు, మాంసం, చికెన్, చేపలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు అన్నీ ఓకే చోట లభ్యమయ్యేలా సౌకర్యవంతంగా ఉంటుంది. సుమారు 6 నెలల నుంచి 8 నెలలోపు మార్కెట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
-చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్, మెదక్
సమీకృత మార్కెట్ కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 2 ఎకరాల 30 గుంటల భూమిని ఎంపిక చేయడం జరిగింది. నిర్మాణ పనులకు టెండర్ పూర్తయింది. పనులు ఇటీవల ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలు, పండ్లు, మాంసం ఒకేచోట విక్రయించేలా గజ్వేల్ తరహాలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించడం జరుగుతుంది. -శ్రీహరి, మున్సిపల్ కమిషనర్, మెదక్
మెదక్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో 108 దుకాణాలు నిర్మించనున్నారు. ఇందులో కూరగాయల దుకాణాలు 60, మాంసం దుకాణాలు 30, పూలు, పండ్ల దుకాణాల కోసం 18 దుకాణాలు నిర్మించనున్నారు. పబ్లిక్ టాయిలెట్స్, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయనున్నారు.