సంగారెడ్డి, నవంబర్ 1 : ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్యూమరేటర్లను సూచించారు. మండలంలోని ఇరిగిపల్లి, సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డు శివాజీ నగర్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వే విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశా ల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు బ్లాక్‌ల వారీగా ఇండ్ల వివరాలను సిద్ధం చేసుకుని సర్వే చేపట్టాలన్నారు. మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌ను ఆమె ఆదేశించారు. సర్వేకు అవసరమైన ఇంటి జాబితా, ఫారాలు, స్టిక్కర్లు కలెక్టరేట్లో తీసుకోవాలన్నారు. ఇంటి జాబితా ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పూర్తిచేసేలా తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని, సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ అతికించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇరిగిపల్లి ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మండల ప్రత్యేకాధికారి ఖాసీవా బేగ్, తహసీల్దార్ దేవదాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, అధికారులు ఉన్నారు.