సంగారెడ్డి కలెక్టరేట్/సంగారెడ్డి, మే 22: మామిడిలో కొత్త కొత్త రకాలు రూపొందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లాలో మామిడి సాగు ముఖ్యమైనదన్నారు. రెండు రోజులుగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న మామిడి రకాల ప్రదర్శనను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. 477 మామిడి పండ్ల రకాలకు గానూ ప్రదర్శనలో 250 రకాలను ఉంచారు. ఆయా మామిడి రకాలను పరిశీలించిన కలెక్టర్ రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి తోటల్లో భాగంగా జిల్లాలో మామిడి సాగు ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. మామిడి విస్తీర్ణం 14 నుంచి 15 వేల ఎకరాల్లో జరుగుతున్నదని, మామిడి పండ్లలో మెరుగైన రకాలను తయారు చేసి ప్రజలకు అందించి నాణ్యమైన రుచులను చేరువ చేయాలన్నారు.
ముఖ్యంగా మామిడి తోటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి పూర్తిగా సేంద్రియ ఎరువులతో పెంచితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. రైతుల సమస్యలను ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ఫల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ హస్తబల్ అని పిలువబడే గుర్రపు శాఖలో 470 రకాల మామిడి జన్యు సంపత్తికి ఎలా నిలయమయ్యిందనే విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, సహాయ అధికారులు శైలజ, సమంత, స్పందన, కీర్తి, ఫల పరిశోధన శాస్త్రవేత్తలు డాక్టర్ హరిషంత్, డాక్టర్ మాధవి, డాక్టర్ మౌనిక, డాక్టర్ నితీశ్, ఏవో యుగంధర్, మామిడి రైతులు పాల్గొన్నారు.