సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 13: ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీవోలు, తహసీల్దార్లు వారిస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం మండలస్థాయి అధికారులు గ్రామాల్లో సర్వే చేసి పూర్తి నివేదికను కలెక్టరేట్‌కు సమర్పిస్తే పరిష్కరిస్తామన్నారు.
ధరణిలో ఒక్కో మాడ్యూల్లో ఉన్న డేటా ఎంట్రీ రోజువారీ లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ధరణిలో ఎక్కువగా భూమి స్వరూపం మార్పు పేరులో తప్పులు, సర్వే నెంబర్లలో తప్పులు, విస్తీర్ణంలో తప్పులపై వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఎక్కువగా టీం 33కి సంబంధించిన 8 రకాల సమస్యలు తరుచూ వస్తున్నాయని, వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సూచించారు.