కంది, జూన్ 14: విద్యతోనే చక్కటి భవిష్యత్ ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శ్రద్ధతో చదివి ప్రయోజకులుగా ఎదగాలని విద్యార్థులకు సూ చించారు. బడిబాటలో భాగంగా శుక్రవారం కంది, కాశీపూర్, చెర్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. బాడిబాటలో పెరిగిన విద్యార్థుల సంఖ్యను, పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బడిబాటను నిర్వహిస్తుందన్నారు. మెరుగైన విద్యను అందిచాలన్న ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కమిటీల ద్వారా పనులు చేపట్టి ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో పనులతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్లను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు చేశామని, పాఠశాల పనుల్లో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నదని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్ని వసతులతో నాణ్యమైన బోధన జరుగుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని కోరారు. విద్యార్థులతో మాట్లా డి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంతకుముందు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో నర్సింహగౌడ్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.