కంది, ఆగస్టు 31:ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, తహసీల్ కార్యాలయం, జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పీహెచ్సీలో వార్డులను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించి, ప్రభుత్వ దవాఖానలో అందుతున్న అన్ని రకాల వైద్య చికిత్సలు, పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించి వినియోగించుకునేలా చూడాలన్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా గట్టి నిఘా పెట్టాలని తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ రికార్డులు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, ధరణి ఫిర్యాదుల పరిష్కారం తదితర వాటిని పరిశీలించారు. భూ రికార్డుల ఫైల్స్‌ను భద్రంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో చెరువులు, కుంటలు, శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాని ఆదేశించారు. ధరణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అవసరమైతే తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
కంది మైనార్టీ గురుకుల పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారికి అందుతున్న బోధనను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను తనిఖీ చేసి విద్యార్థులకు వడ్డించే భోజనం, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. వంటశాల, తరగతి గదులు, టాయిలె ట్స్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాని కెళ్లి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, రికార్డులను పరిశీలించా రు. ఏపీజీవీబీని సందర్శించి రుణమాఫీ తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కంది త హసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మ ల్లయ్య, ఎంపీవో మహేందర్‌రెడ్డి, జీపీ కార్యదర్శి విద్యాధర్గౌడ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.