సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 20: ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభత్ర పాటించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కిందిబజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం పాఠశాలలోని పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల రక్తహీనత, బలహీనత, ఆకలి మందగించడం, కడుపునొప్పి, శారీరకంగా, మానసికంగా ఎదగకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయన్నారు. దీంతో చదువుల్లో వెనుకబడుతారని, భవిష్యత్తు పాడవుతుందన్నారు. పిల్లలు బాగా చదవాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు.
చాలామంది బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని, ఈ సమస్యను అధిగమించాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ సంవత్సరంలో రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలన్నారు. ఒకటి నుంచి 19 ఏండ్లలోపు పిల్లలందరూ ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. అమ్మాయిలు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డీఐవో డాక్టర్ శశాంక్ దేశ్పాండే, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్ శశాంక్, పాఠశాల ప్రిన్సిపాల్ రోజా, శ్రీరాంసుధాకర్, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.