సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 13: టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో రీజినల్ కోఆర్డినేటర్లు, స్ట్రాంగ్‌రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డీవోలు, ఫ్లైయింగ్ స్కాడ్స్, రూట్ ఆఫీసర్లతో నిర్వహించిన శిక్షణ, సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చూడాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, సాయంత్రం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటల వరకే చేరుకోవాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, వివిధ కేటగిరీల అధికారులు పాల్గొన్నారు.