మెదక్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒకరూ కృషిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..ఆడపిల్లలను రక్షించడం, చదివించడం వల్ల సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ వివక్షలేని సమాజాన్ని నిర్మించాలన్నారు. అమ్మాయిలు సమస్యలను ధైర్యంగా ఎదురొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం బేటీ బచావో- బేటీ పడావో క్యాలెండర్, కేరియర్ గైడెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరు అడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సన్మానం చేశారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్సీ బాలికల హాస్టల్‌కు (నర్సాపూర్) చెందిన మలోతు శ్రీలతను అభినందించి, శాలువాతో సన్మానించారు. అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ మహేందర్, డీఆర్వో పద్మశ్రీ, డీఈవో రాధాకిషన్, డీఎంహెచ్‌వో చందునాయక్, సూపర్ వైజర్స్, చైల్డ్ లైన్ కోర్డినేటర్లు, వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, వివిధ ఎన్జీవోల అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.