Collector Rahulraj | మెదక్, ఏప్రిల్ 15 : తాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు.
ఇవాళ కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో వేసవిలో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ గృహ నిర్మాణాల పురోగతి విషయాలపై అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, డీఆర్ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం సంబంధిత ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీవోలు, ఎంపీఓలతో కలెక్టర్ రాహుల్రాజ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవికాలం పూర్తి చేసుకొని వర్షాలు వచ్చేవరకు తాగు నీటి సరఫరా అంశంపై అప్రమత్తంగా ఉండాలని, క్ష్రేతస్థాయిలో తాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళిక, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలు, నీటి పునరుద్ధరణ వివరాలు తెలియజేయాలని అన్నారు.
వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్దంగా ఉన్నామని అన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి క్ష్రేతస్థాయి నుంచి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తాగునీరు ఇబ్బందులు తొలగించి.. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలని పేర్కొన్నారు.
ప్రతిరోజు పర్యవేక్షించాలి..
రానున్న రెండు నెలల పాటు క్ష్రేతస్థాయిలో తాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు తాగు నీరు సరఫరా అవుతున్న హ్యాబిటేషన్స్ను క్ష్రేతస్థాయిలో పరిశీలించి రిపోర్టు అందించాలన్నారు.
అవసరమైన మేర సిబ్బందిని నియమించుకొని భూగర్భ జలాల నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ జిల్లాలో అవసరమున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికలో దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎంపిక చేయాలని తెలిపారు.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. ప్రతీ గ్రామం నుండి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని అట్టి జాబితా ప్రకారం విచారణకు గెజిటెడ్ అధికారులను విచారణ అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు.
ప్రతీ గెజిటెడ్ అధికారికి 200 మంది లబ్ధిదారుల జాభితా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి రోజు కనీసం 25 మంది లబ్ధిదారుల విచారణ చేపట్టి ఇట్టి ప్రకియను 8 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్య్రకమంలో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.