మెదక్ రూరల్ ఆగస్టు 08 : రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామం యూనిట్‌గా వార్డుల వారీగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ తయారు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పంచాయతీల్లో ఓటరు జాబితా తయారీ మ్యాపింగ్‌లో భాగంగా హవేలీ ఘన్పూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. వార్డులు వారీగా ఓటర్స్ మ్యాపింగ్ విధానాన్ని సంబంధిత జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి పరిశీలించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో గ్రామపంచాయతీ ఓటర్ నమోదు మ్యాపింగ్ ప్రక్రియ ఎంపీడీవోల పర్యవేక్షణలో పంచాయతీ సెక్రెటరీ, కంప్యూటర్ ఆపరేటర్స్‌తో పగడ్బందీగా కొనసాగుతుందని చెప్పారు. దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు రూపొందించిన ఓటర్ల జాబితాను టీపోల్ యాప్‌లో నమోదు చేసేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక లాగిన్ ఐడీ, పాస్‌వార్డును అందించారన్నారు. కొత్తగా ఏర్పడిన ఒక్కో పంచాయతీలో ఆరు వార్డులకు తగ్గకుండా ఓటర్లను విభజించాలని అందులోనూ ఒక కుటుంబం ఒక వార్డులోనే ఉండేలా నమోదు చేయాలన్నారు.