ముదిగొండ, ఏప్రిల్ 17: జిల్లాలోని ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమ ఉద్దేశం నెరవేరిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముదిగొండ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ వేడుకల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఆ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, విద్యార్థులతో మమేకమయ్యారు. వారి పఠనా నైపుణ్యాలను పరిశీలించారు.
విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు, కథలు చదవడం, ఆత్మవిశ్వాసంతో పఠనం చేయడం చూసి కలెక్టర్ సంతోషించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పాఠ్యాంశాలను చదవడం అత్యంత ముఖ్యమైన నైపుణ్యమని, చదవగలిగితే రాయడం, మాట్లాడడం సులభంగా వస్తాయన్నారు. చదవలేని పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుందని, ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి పరిషరించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 29 వేల మంది విద్యార్థులు పఠణా నైపుణ్యాలు సాధించారని, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని సొంతంగా స్వీకరించి విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.
పాఠశాలల్లో ప్రతి రోజూ పఠనా నైపుణ్యాల పెంపునకు ఒక గంట సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ వీడియోలను ప్రదర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు. ఆనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటో, ప్రశంస ప్రతాలు అందజేశారు. ఎంఈవో రమణయ్య, ఇన్చార్జి ఎంపీడీవో భాస్కర్‌రావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.