జహీరాబాద్, జవనరి 4 : సంగారెడ్డి జిల్లాలో చలితీవ్రత పెరిగింది. శనివారం రాష్ట్రంలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కోహీర్‌లో 6.0 డిగ్రీలుగా నమోదైంది.
న్యాల్కల్లో 6.3 డిగ్రీలు, జహీరాబాద్ మండలం మల్చాల్మాలో 7.3, అల్గోల్‌లో 7.9, సత్వార్‌లో 8.1, మొగుడంపల్లిలో 8.3, ఝరాసంగంలో 8.7, జహీరాబాద్ 9.1, కోహీర్ దిబ్బలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటున్నది.
దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఉదయం పనులకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, మున్సిపల్, పంచాయతీ పారిశుధ్య సిబ్బంది చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.