రామచంద్రాపురం, జూలై 3: రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా లేదా అనేది అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూర్‌లో పెద్ద చెరువుకు సంబంధించిన ప్రధాన కాల్వలో ఓ ప్రైవేట్ వ్యక్తి మట్టి నింపి మూసివేశాడు. దీంతో వర్షపు నీరు కాల్వనుంచి సాఫీగా వెళ్లడానికి వీలులేక పంట పొలాలు మునిగిపోవడంతో పాటు రోడ్డుపైకి నీరు వచ్చి నిలుస్తున్నది. కాల్వ ఆక్రమణకు సంబంధించి ఇటీవల నమస్తే తెలంగాణలో ‘పెద్దచెరువు కాల్వ ఆక్రమణ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
దీనికి స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాల్వ ఆక్రమణపై నామమాత్రంగా చర్యలు చేపట్టినప్పటికీ రాత్రికిరాత్రి టిప్పర్లతో పెద్దఎత్తున మట్టిని నింపారు. పైభాగంలో కాల్వలో పెద్ద ఎత్తున మట్టిని నింపడంతో కింది భాగంలో ఉన్న పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. అయితే ఈ సమస్య సీఎంసీ కమిషనర్ సృజన దృష్టికి వెళ్లడంతో శుక్రవారం పెద్ద చెరువు కాల్వను ఆమెతో పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు. పెద్ద చెరువు కాల్వకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
కాల్వపునరుద్ధరణకు చర్యలు చేపడుతామని సీఎంసీ కమిషనర్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ గ్రామస్తులకు తెలిపారు. చెరువు కట్టను పరిశీలించి పునరుద్ధరణ కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని గ్రామస్తులకు చెప్పి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేత రాజుగౌడ్ సొంతంగా ప్రొక్లెయినర్ ఏర్పాటు చేసి కాల్వలో నింపిన మట్టిని తొలిగిస్తున్నారు. కాల్వ ఆక్రమణ విషయంలో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చెరువుకు సంబంధించి ప్రధాన కాల్వలో మట్టిని నింపి మూసి వేయడం జరిగిందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నమస్తే తెలంగాణలో కాల్వ ఆక్రమణపై కథనం వచ్చిన తర్వాత అధికారులు నామమాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొన్నారన్నారు.
కాల్వ ఆక్రమణకు పాల్పడిన వారిపైన నేటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వను మూసివేయడంతో చెరువు కట్ట తెగిపోయే స్థితికి చేరిందన్నారు. కాల్వ ఆక్రమణకు పాల్పడిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టకుండా అధికార యంత్రాంగం ఏమి చేస్తు ంది.. నిద్రపోతుందా అంటూ నిలదీశారు. అధికారులు తక్షణం స్పందించి కాల్వ ఆక్రమణదారుడిపైన క్రిమినల్ కేసు నమోదు చేయించాలని ఆయనతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. జోనల్ కమిషనర్ నారాయణఅమిత్, డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు యాదయ్య, ఇరిగేషన్, బల్దియా అధికారులు పాల్గొన్నారు.