గజ్వేల్, మే 21: రేవంత్ సర్కారుతో ఆటోడ్రైవర్ల బతుకులు భారంగా మారాయి. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో లక్షలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోనే సుమారుగా మూడు వేల పైచిలుకు కుటుంబాలు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మార్గంలో ప్రతిరోజూ సుమారుగా ఐదువందల ఆటోలు తిరుగుతాయి. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ వద్ద మొత్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆటోలు సిద్ధంగా ఉన్నా ఒక్కరూ కూడా ఎక్కేందుకు ముందుకురావడం లేదు. మహిళా ఉద్యోగులు సైతం బస్సుల కోసమే వేచి ఉంటున్నారు. గజ్వేల్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ములుగు, వర్గల్, మర్కూక్, కొండపాక, కుకునూర్‌పల్లి మండల కేంద్రాల్లో నిత్యం వందలాది ఆటోలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకంగా మారుతున్నాయి. ఆర్టీసీ బస్సు తిరగని గ్రామాలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటోలే ప్రధాన ఆధారం. అలాంటిది రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబాల్లో రోజూ గడవడమే గగనంగా మారింది. బతకడమే కష్టంగా మారింది.
హత్నూర, మే 21: ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆటోడ్రైవర్లకు తీరని అన్యాయం చేసింది. రోజూ ఆటోతో అడ్డాపైకొచ్చి ప్రయాణికుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. అప్పు చేసి ఆటో కొనుగోలు చేస్తే ఉపాధి కోల్పోయి అప్పు కట్టలేకపోతున్నా. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఫీజుల భారం, చేసిన అప్పులు చెల్లించలేక మనోవేదనకు గురవుతున్నాం. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల బతుకుపై దెబ్బ కొట్టే విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బతకాలో చావాలో తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలకు మేలు చేసినా నాలాంటి నిరుపేద ఆటోడ్రైవర్లకు మాత్రం తీరని అన్యాయం చేసింది ప్రభుత్వం.
హత్నూర, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటోడ్రైవర్ల బతుకుదెరువుపై దెబ్బకొట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో మహిళలు బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో గంటల తరబడి ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లో అప్పు తీసుకొని ఆటో కొనుగోలు చేసి నెలకు రూ.8వేల కిస్తీ కట్టేది. ఇప్పుడు దందలు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇబ్బంది పడుతుంటే నెలనెలా ఫైనాన్స్ ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. గతంలో రోజుకూ ఖర్చులు పోనూ రూ.800 సంపాదిస్తే ప్రస్తుతం రూ.200 కూడా రావడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులతో బతకడం భారమవుతున్నది. ప్రభుత్వం స్పందించి ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి.
వట్పల్లి, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మా బతుకులు దుర్భరమయ్యాయి. ఆటోలు నడువకా… అప్పులు పుట్టకా… కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఓవైపు అప్పులు, మరోవైపు కుటుంబ భారం ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం స్పదించి ఆటో డ్రైవర్లను ఆదుకోకపోతే ఆకలి చావులు చావాల్సి వస్తుంది.
సిద్దిపేట టౌన్, మే 21: కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. రేవంత్ తెచ్చిన ఫ్రీ బస్సు వేలాది ఆటోడ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేసింది. ఆటో కార్మికుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమాన్ని అకాంక్షిస్తూ అనేక పథకాలను అమలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మా పొట్ట కొట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆటో కార్మికులను నమ్మించి మోసం చేశాడు. ఫ్రీ బస్సుతో నష్టపోతున్న ఆటోవాలాలకు ప్రతినెలా రూ.20 వేలు ఇవ్వాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం.
కోహీర్, మే 21: చాలా సంవత్సరాలుగా ఆటో నడుపుతూ వచ్చే పైసలతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని పెట్టారు. దీంతో ఆడవాళ్లు ఆటోల్లో ఎక్కడమే మానేశారు. రోజుకు రూ.500 వచ్చేది గగనంగా మారింది. మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఇంతకుముందు రోజూ రూ.2వేల వరకు వచ్చేవి. ఇప్పుడు మా పిల్లల చదువులు, ఖర్చులకు అప్పు చేయాల్సి వస్తున్నది.
ఆటో నడుపుతూ ఉన్నదాంట్లో సంతోషంగా బతికినం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఆగమైనయ్. కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వచ్చింది. పిల్లలను స్కూల్‌కు పంపేదెలా.. ఫీజులు కట్టేదెలా. రోజుకు వచ్చే రూ.500లతో కుటుంబం గడిచేదెలా. తలుసుకుంటేనే భయమేస్తున్నది. ప్రభు త్వం ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.
శివ్వంపేట, మే 21: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటోడ్రైవర్ల పరిస్థితి గిరాకీ లేక బతుకు భారమైంది. 2018 నుంచి శివ్వంపేట మీదుగా నర్సాపూర్ నుంచి తూప్రాన్‌కు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. మాకు ఇద్దరు పిల్లలు. వారిని గతంలో ప్రైవేటు పాఠశాలలో చదివించా. గిప్పుడు ఉచిత బస్సులతో ఆటోలకు గిరాకీ అసలే లేవు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో చేర్పించా. కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైనయి. ప్రభుత్వమే ఆదుకోవాలి.
మూడు నెలలుగా ఆటో కిస్తీలు కట్టడం భారంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా బతుకులు ఆగమయ్యాయి. అప్పట్లో ప్రతిరోజూ డీజిల్ ఖర్చులు పోనూ ఇంటికి రూ.600 నుంచి రూ.700 తీసుకపోయేది. ఇప్పుడు పొద్దంత కష్టపడినా రూ.200 తీసుకుపోతే మహా ఎక్కువగా ఉంటుంది. కిస్తీలు కట్టకపోతే ఎప్పుడు వచ్చి ఆటోను తీసుకుపోతారోననే భయం ఉంది. నేనే కాదు చాలామంది ప్రతినెలా కిస్తీలు కట్టలేక, కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదికి ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చేయలేదు. వచ్చేనెల పిల్లలకు పుస్తకాలు, యూనిఫాంలు కొనాలే. ఖర్చులు గుర్తొస్తే దిగులుగా ఉంది. 25ఏండ్లుగా ఆటో నడుపుతున్నా. ఇసుంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మా బతుకులను ఆగం చేసింది. డ్రైవర్లంతా అరిగోస పడుతుండ్రు.
హుస్నాబాద్ రూరల్, మే 21: హుస్నాబాద్‌లో 13 ఏండ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టింది. దీంతో ఆటోలకు మునుపటి లెక్క గిరాకే ఉంటలేదు. అంతకుముందు రోజూ రూ.600 నుంచి రూ.700 వచ్చేవి. వచ్చిన ఆదాయంతో ఆటోకు ఫైనాన్స్ కడుతూ భార్య,పిల్లలతో సంసారం వెళ్లదీసెటోడ్ని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో ఫైనాన్స్ కట్టడమే ఇబ్బందిగా మారింది. ఆటో డ్రైవర్ల జీవితాలే నాశనమయ్యాయి. రోజులు గడిస్తే ఆటో డ్రైవర్లు కూలీలుగా మారాల్సిందే. ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఏదైనా ఉపాధి చూపే మార్గం ఆలోచించాలె.
మిరుదొడ్డి, మే 21: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక…మా ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఆటో కార్మికులము ఎలాంటి ఢోకా లేకుండా బతికినం. అప్పుడు ప్రతిరోజూ ఆటోకు డీజిల్ ఖర్చులు పోనూ రూ.500 వరకు ఇంటికి తీసుకొని పోయేటోళ్లం. గీ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక తిండికే కష్టం వచ్చింది. ఫ్రీ బస్సులతో రోజంతా కష్టపడినా రూ.50 మాత్రమే దొరుకుతుంది. మేము ఎలా బతకాలే… పిల్లలను ఎట్లా సాకాలే..శాన ఇబ్బందిగా ఉంది. మా ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.
పదేండ్ల నుంచి ఆటో నడపుతూ ఉన్నంతలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి మా పరిస్థితి దయనీయంగా మారింది. మహిళలకు ప్రభుత్వం బస్సుల్లో ఫ్రీ టికెట్ పెట్టడంతో మహిళలు ఆటోలు ఎక్కడమే మానేశారు. మహిళలతో పాటు మగవారూ అదే బస్సులో ప్రయాణించడంతో ఆటోడ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉదయం లేవగానే అడ్డామీద పెడితే ఒక్కరో ఇద్దరో ఎక్కితే కూడా నష్టానికి సైతం పోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఏం మంచి చేసిందో నాకు తెల్వదు, కానీ మా ఆటోడ్రైవర్లకు మాత్రం చెడు చేసింది.