సిద్దిపేట, మే 1: సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పాత కార్యాలయ ప్రాంగణం వద్ద తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి జిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం చేశారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ మొట్టమొదటి సంతకం చేసి హామీని అమలు చేసిన గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. 21 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేదన్నారు.
మంత్రి హరీశ్‌రావు సహకారంతో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, అందరం రుణపడి ఉంటామన్నారు. పట్టుదలతో అహర్నిశలు శ్రమిస్తూ బంగారు తెలంగాణ.. ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడుతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చక్రధర్, ల్యాబ్ సాంకేతిక నిపుణులు శ్రీనివాస్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అనురాధ, శ్యామ్‌సుందర్, విజయ్‌కుమార్, గోపాల్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు సుధీర్, నాగేందర్‌రెడ్డి, వాసు, నాగరాజు, సురేశ్, శ్రీధర్, కొమురయ్య, శ్రావణ్‌కుమార్, నర్సింహులు, రఘు, దేవదాసు పాల్గొన్నారు.