మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబర్ 1: స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని మోతెలో సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ అధ్యక్షతన రూ.26 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ, భూంపల్లిలో బక్కి భాగ్యమ్మ వెంకటయ్య అధ్యక్షతన రూ.69 లక్షలతో మనఊరు- మనబడిలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల నూతన భవనం, రూ.26 లక్షలతో పద్మశాలీ, నాయి బ్రాహ్మణ కులాలకు చెందిన కమ్యూనిటీ భవనాలు, రూ.25 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్, రూ.8.25 కోట్లతో నిర్మించిన 165 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.
అర్హులకు జడ్పీ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలతో కలిసి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజల గుడెల్లో సీఎం కేసీఆర్ గూడు కట్టుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల అభుభ్యున్నతికి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలు సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి, రైతులను ఆర్థికంగా రాజులను చేస్తున్నారన్నారు. కొన్నేండ్ల నాటి నుంచి నీరు లేక వెలవెల బోయిన కూడవెల్లి వాగు నేడు సీఎం కేసీఆర్ దయతో జీవ నదిని తలపిస్తున్నదన్నారు. నిరంతరం నీటితో ప్రవహిస్తున్నదన్నారు. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఉంటే సుభిక్షంగా ఉంటుందన్నారు.
ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోతే మళ్లీ గోస పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినంక ఏ ఒక్క పనైనా చేశాడా అని ప్రశ్నించారు. చీరె, సారెలకు ప్రజలు మభ్య పడకుండా ప్రజల మనిషి సీఎం కేసీఆర్‌ను మూడోసారీ సీఎంగా చేయాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి తనను ప్రజలు ఆశీర్వదిస్తే వారికి సేవకుడిగా ఉంటూ పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ నమిలే భాస్కరాచారి, వైస్ ఎంపీపీ పోలీసుల రాజులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, ఎంపీటీసీ ఉమారాణి బాలాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, ఉప సర్పంచ్ ప్రభాకర్, పార్టీ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, బోయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సల్లంగుండాలి
మా గరీబోళ్లకు ఇండ్లు కటించి, ఇంటిలోకి తోలిన సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలి. శాన రోజుల నుంచి ఎండలో ఎండుతూ, వానలో నానుతూ పిల్లతో బతికినం. గిప్పుడైతే సీఎం కేసీఆర్ సారు మాకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇయ్యడం చాలా సంతోషం. నా జీవితాంతం సీఎం కేసీఆర్ సారు ఎంటనే ఉంట
– చుక్క కనకవ్వ, భూంపల్లి
సీఎం సారుకు కృతజ్ఞతలు
ఏండ్ల కొద్ది ఇల్లులేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ మాకు రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, మాకు ఇయ్యాల్ల ఇచ్చిండు. మాలాంటి పేదళ్లోకు సీఎం కేసీఆర్ సారు ఇండ్లు ఇయ్యడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ రుణాన్ని బతికి ఉన్నంత కాలం తీర్చుకుంటాను
– నీల మమత, భూంపల్లి