‘నర్సాపూర్ నియోజకవర్గంలో మీరంతా కష్టపడేటోళ్లు ఉన్నరు. రైతులు మంచి పంటలు పండించేటోళ్లు ఉన్నరు. ఈ నియోజకవర్గాన్ని వజ్రపు తునకలెక్క తయారుజేస్తా. పిల్లుట్ల కాల్వ పూర్తయితే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి, సాగునీళ్లు తెస్తా. ఆ బాధ్యతా నేనే తీసుకుంటా.. కాంగ్రెస్ హయాంలో మంజీరా, హల్దీవాగులు ఎట్లుండె.. ఆనాడు మంజీరా, హల్దీ వాగులపై చెక్‌డ్యామ్‌లు కట్టొద్దు అని బ్యాన్ చేసిండ్రు. మేము రెండు నదుల మీద 14 చెక్‌డ్యామ్‌లు కట్టినం. ఈ నదులు జీవ నదుల్లా ఉన్నాయి. హల్దీవాగులో కాళేశ్వరం నీళ్లు పోసి పంటల సమయంలో మత్తళ్లు దుంకిస్తున్నాం. దీంతో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఆ రోజుల్లో కరెంట్ ఎట్లుండె.. బావుల వద్దకు రైతులు పోతే పాములు, తేళ్లు కరిసి కొంతమంది, కరెంట్ షాక్‌లతో మరికొంత మంది రైతులు చనిపోయిండ్రు.. బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నది. దీంతో రైతులకు కరెంట్ రంది తీరింది. రైతులకు సౌలత్ అయ్యింది’.. అని నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
సిద్దిపేట, నవంబర్ 16( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజీరా నది, హల్దీవాగులు ఎట్లా ఉండేవో మీకు తెలుసు. ఆనాడు ఎవరన్నా పట్టించుకున్నారా? కాంగ్రెస్ వాళ్ల తెలివికి ఏం చేసిండ్రో తెలుసా? మంజీరా, హల్దీ వాగుల మీద చెక్‌డ్యాంలు కట్టొద్దని బ్యాన్ పెట్టిండ్రు.. అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస పార్టీపై మండిపడ్డారు. గురువారం నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, స్థానిక శాసనసభ్యుడు చిలుముల మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, రఘుపతిరెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్‌తోపాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నర్సాపూర్ జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇయ్యాళ రెండు నదుల మీద 14 చెక్‌డ్యాంలు కడితే రెండు నదులు కూడా జీవ నదులుగా ఉన్నాయన్నారు. హల్దీ వాగులో కాళేశ్వరం నీళ్లు పోసి పంటల సమయంలో మత్తళ్లు దుంకిస్తున్నామన్నారు. ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్నాయన్నారు.
కాళేశ్వరం నీళ్లతో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయన్నారు. ఇయ్యాళ కరెంట్ ఎట్లా ఉంది.. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదన్నారు. రైతులు బావుల వద్దకు రాత్రి పోతే పాములు, తేళ్ళు కరిసి చాలా మంది చనిపోయేవారన్నారు. కరెంట్ షాక్ కొట్టి రైతులు మృతిచెందారన్నారు. ఇవ్వాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే దర్జాగా ఇంటి కాడ ఉండి పొద్దటి పూట బావుల వద్దకు వెళ్లి రైతులు కరెంట్ పెట్టుకుంటున్నారన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన సదుపాయాలని తెలిపారు. ఇవన్నీ ఉండాలి. ఇంక మంచిగా మెరుగైన సదుపాయం కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే సాధ్యమైతదన్నారు. వేరే పార్టీలు గెలిస్తే సాధ్యం కాదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? రైతుల సౌలతులు ఎలా ఉన్నాయి..? మంచినీళ్లు ఎట్లా వచ్చినయి? ఇవన్నీ ఆలోచన చేయాలన్నారు. నాడు మంచినీళ్లకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. మూడు నాలుగు రోజులైనా నీళ్లు రాకపోయేవన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు మోటర్లు కాలిపోతుంటే వశం కానీ భాదలు ఉండేవన్నారు.
తాను మదన్‌రెడ్డి చొరవ తీసుకుని కోమటి బండ నుంచి లింకు ఇచ్చామన్నారు. ఇయ్యాళ ఫుల్‌గా బ్రహ్మాండంగా తాగునీరు అందుతున్నదన్నారు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఇట్లా ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదన్నారు. అనేక కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కసారి సాగు నీటి కాల్వలు పూర్తి అయ్యాయంటే బ్రహ్మాండంమైన నీటి పారుదల వచ్చి నర్సాపూర్ నియెజకవర్గంలో మీరంతా కష్టపడేటోళ్లు, రైతులు మంచి పంటలు పండించే వాళ్లు. దీంతో వజ్రపు తునకలాగా తయారైతది. పిల్లుట్ల కాల్వ పూర్తి అయితే తానే వచ్చి కొబ్బరి కాయ కొట్టి సాగు నీళ్లు తెస్తా అని చెప్పిన.. తప్పకుండా ఆ బాధ్యత తనదేనని అన్నారు. అన్ని వర్గాలు కలిసి పని చేసుకుంటున్నామన్నారు. దౌల్తాబాద్, కాసాలా మున్సిపాలిటీలు కావాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఇద్దరు కూడా కోరినారు. తప్పకుండా వాటిని చేసుకుందామన్నారు. రంగంపేట మండలం కావాలని కోరారు.. దాన్ని కూడా చేసుకుందామని చెప్పారు. కౌడిపిల్లికి డిగ్రీ కళాశాలను తెచ్చుకున్నామన్నారు. గ్రామగ్రామాన మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పెట్టాలన్నారు.
సునీతాలక్ష్మారెడ్డిని నర్సాపూర్ నుంచి నిలబెట్టుదామని మదన్‌రెడ్డికి చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. వారు చాలా సహకరించి నర్సాపూర్ నుంచి సునీతను పెట్టండని చెప్పారన్నారు. మదన్‌రెడ్డి ఖాళీగా ఉండడు, ఆయన కూడా గౌరవప్రదమైన సముచిత స్థానంలో ఉంటాడన్నారు. మదన్‌రెడ్డి తన చిరకాల మిత్రుడు, ఇయ్యాళ కొత్తగా కాదు నాకు పాత మిత్రుడు అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే కావడం కోసం ఎన్నో బాధలు పడ్డ విషయం మీకు తెలుసు. అదే ప్రకారంగా ఇద్దరు కలిసి నర్సాపూర్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారన్నారు. ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. సునీతా లక్ష్మారెడ్డిని మదన్‌రెడ్డి ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నర్సాపూర్‌లో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కొన్ని కోరికలు అడిగారు వాటిని అన్నింటిని చేసుకుందామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఎన్నికలు చాలాసార్లు వస్తా ఉంటాయి.. పోతా ఉంటాయి. ఎన్నిలకు రాగానే ఆగంఆగం కావద్దన్నారు. మంచిగా నిదానంగా ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. మంచి చెడ్డా ఆలోచన చేశాకనే తమ ఓటు వేయలన్నారు. అలా వేసినప్పుడే మంచి జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒక్కటే ఒక్కటి ఆయుధం మీ ఓటు అని అన్నారు. అది చాలా విలువైందన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల కోసం మీ తలరాతను నిర్ధేశిస్తది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే ప్రతి పార్టీ నుంచి ఎవరో ఒకరు నిలబడతారు. మన బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని నిలబెట్టాం. ఇతర పార్టీల నుంచి ఎవరో ఒకరు నిలబడ్డారన్నారు. నిలబడిన అభ్యర్థుల మంచి చెడులను గమనించాలన్నారు. అభ్యర్థుల వెనుకాల పార్టీలు ఉంటాయన్నారు. ఆ పార్టీలు ఏం చేసాయి. ఏ పార్టీ మంచి చేస్తది అని ఆలోచన చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. తొమ్మిదేండ్లలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా పనులు జరిగాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గ్రామాల్లో చర్చ పెట్టం డి. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన రోజుల్లో చాలా కష్టాలు ఉండే రాష్ట్రంలో అని సీఎం కేసీఆర్ అన్నారు. కరెంట్ లేదు, తాగునీరు లేదు. సాగునీరు లేదు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఉన్నాయన్నారు. రైతుల ఆత్మహత్యలు, ప్రజలు వలసలు పోయారు అన్ని ఇబ్బందులు ఉండేవన్నారు. కొత్తకుండలో ఈగలు సొచ్చినట్లుగా ఉండేనన్నారు. మేధావులను పిలిపించి మట్లాడి పరిస్థితిని అంచనా వేసుకుని ఒక మార్గం పట్టామన్నారు. ఆ భగవంతుని దయవల్ల చాలా విజయవంతం అయిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు బాగా తీసుకున్నామన్నారు. ఆ తర్వాత రైతుల గురించి అద్భుతమైన పనులు చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆసరా పింఛన్లు పెంచుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత వచ్చేది మీకు తెలుసన్నారు. ఇవ్వాళ ఎంత ఇస్తున్నామో మీకు తెలసన్నారు. వందల్లో ఉన్న పింఛన్‌ను వేలలో తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రేపు మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక రూ.5 వేలు చేసుకుంటున్నామన్నారు. కేసీఆర్ కిట్టు, కల్మాణలక్ష్మి, షాదీముబారక్, కంటివెలుగు తదితర కార్యక్రమాలు చేసుకున్నాం, ఇవన్నీ మీ కండ్ల ముందు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.