సిద్దిపేట, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆశేష ప్రజలకు నమస్కారాలు.పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చెప్పి చరిత్రలో చెప్పారు. తాను దుబ్బాకలోనే ఉన్నత పాఠశాల విద్య అంతా చదువుకున్నాను. దుబ్బాకతోని ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే, సీఎం స్థాయికి ఎదిగినానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన చదువు, ఆ భిక్షనే కారణం” అని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రజాఆశ్వీరాద సభ జరిగింది. ఈ సభకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించండి…గెలిచిన నెల రోజుల లోపటనే దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. మన నెత్తిమీద కుండలాగ మల్లన్నసాగర్ ఉందన్నారు. బ్రహ్మాండంగా దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,75,000 ఎకరాలకు సాగు నీరు వస్తుందన్నారు.
కాల్వల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.నాడు కూడవెల్లి వాగు ఎట్లా ఉండే…ఎండి పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేకుండే అన్నారు. ఇవాళ కూడవెళ్లి వాగు ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. మల్లన్నసాగర్ పుణ్యమా అని గోదావరి నీళ్లు కూడవెల్లి వాగులోకి వస్తున్నాయన్నారు. మన రైతులకు సాగునీరు అవసరం కాబట్టి హల్దీవాగు, కూడవెల్లివాగులో బ్రహ్మాండంగా నీళ్లు విడుచుకుంటున్నామన్నారు. భూగర్భజలాలు పైకి వస్తున్నాయన్నారు. పంటలు మంచిగా పండుతున్నాయన్నారు. ఇవన్నీ బాగాచేసుకున్నామని, ఇంకా బాగా అభివృద్ధి కావాలన్నారు. మీ అందరిని కోరేది ఒక్కటేనన్నారు.కూడవెల్లి దేవుడి దగ్గరికి తాను ఎన్నో సార్లు పోయానని చెప్పారు.రేకుల కుంట మల్లన్న జాతరకు కూడా వెళ్లానని గుర్తుచేశారు. ఆలయాలను బాగు చేసుకుందాం. దుబ్బాక ఇంకా అభివృద్ధి కావాలి అని చెప్పారు. దుబ్బాక మీద ప్రేమ ఉంటది .దుబ్బాక రింగురోడ్డు వెంటనే సర్వే చేయించి దానిని కూడా చేసుకుందామన్నారు. అది పెద్ద సమస్య కాదన్నారు. దుబ్బాక రాబోయే రోజుల్లో పెరుగుతది..పెద్ద పట్టణం అవుతుంది..ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయిందన్నారు. రెండు వందల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇంకను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి విజయం చూపెట్టండి తప్పకుండా దుబ్బాక సమస్యలు పరిష్కరించే బాధ్యత తనది అని ప్రజల హర్షధ్వానాల మధ్యన సీఎం కేసీఆర్ చెప్పారు.
మీ అందరిని కోరేది ఒక్కటే మీరు బాగా ఆలోచన చేయాలి. మీ దుబ్బాక తలరాతను మార్చే ఎన్నిక అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆషామాషీగా కాదన్నారు. మీ కండ్ల మందు ఉన్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలన్నారు. మీ ఓటు వజ్రాయుధం అని అన్నారు. మొన్న ఉప ఎన్నికల్లో దుబ్బాకలో దెబ్బతిన్నామన్నారు. వట్టిగా ఓటు వేసి దెబ్బతిన్నాం. అలా జరగకూడదని ప్రజలను కోరారు. దుబ్బాకలో ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి రైతు బంధు ఎకరానిక రూ. 16 వేలు అవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే మీ కండ్ల ముందట అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ హక్కుల కోసమే పుట్టిందన్నారు. 15 ఏండ్లు చావుకు కూడా వెనుకాడకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.10 ఏండ్ల నుంచి అధికారంలో ఉండి ఇవాళ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.
పదేండ్లు ఎంపీగా పనిచేస్తే ఎన్నడూ ప్రభాకర్‌రెడ్డి గర్వం చూపించలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ ఒక్క రోజు కూడా ఆయన గర్వపడలేదు…దర్పం చూపేట్ట లేదన్నారు. జనంలో కలిసి పోయి సాధ్యమైనంత వరకు మంచి చేసిండు తప్పా..చీమకు కూడా అపకారం చేసిన మనిషి కాదన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసన్నారు. దుబ్బాకలో తాను ఉన్నత పాఠశాలలో చదువుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే ఉన్నానని చెప్పారు. ఎప్పుడైనా మనం ఇక్కడ కత్తి పోట్లు చూశామా..? మన దగ్గర ఆ సంస్కారం ఉందా అని ప్రజలను సీఎం కేసీఆర్ అడిగారు.(ఇందుకు లేదు లేదు అంటూ ప్రజలు తెలియజేశారు). ఇక కత్తులే పట్టుకోవాలంటే మనకు దొరకయా అని అన్నారు. కానీ మనకు పద్ధతి కాదు అని మర్యాద పాటించామన్నారు. హుటాహుటిన మంత్రి హరీశ్‌రావు స్థానిక నేతలు ఉరికి ప్రభాకర్‌రెడ్డిని దవాఖానలో అడ్మిట్ చేశారన్నారు.విషయం తెలియగానే వెంటనే తాను పర్యటన ముగించుకొని పోయి పరామర్శించానన్నారు. భగవంతుడి దయ వల్ల ప్రభాకర్‌రెడ్డి బతికి బయట పడ్డారన్నారు.
రామలింగారెడ్డి చనిపోతే దుబ్బాక ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ ఎన్నికలో తాను ప్రచారానికి రాలేదన్నారు. వచ్చి ఉంటే వొడిసిపోయే కథ ( టీఆర్ఎస్ గెలుసు) అని అన్నా రు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి రాకపోతే ఏం జరిగింది..బీజేపీ వాళ్లు మాట్లాడిన వాగ్ధ్దానాలు అయితే చాలా ఉన్నాయని అవి చెప్పరాదన్నారు. తిన్నోనికే ఇస్తారాకు…నాగండ్లు ఎడ్లు.. .గీసన వానికే గుండు ..నోటికి వచ్చిన వాగ్ధ్దానాలు చేసిండు అని బీజేపీ పార్టీని విమర్శించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడరన్నారు. ఒక ఏకనా పని జరిగిందా..? ఇటువంటి మోస కార్లు గెలిచారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఇయాళ దేశంలో 150 మెడికల్ కళాశాలలు పెట్టిండ్రు ..తెలంగాణలో ఏర్పాటు చేయాలని వంద ఉత్తరాలు రాశామన్నారు. ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాకు ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలేదన్నారు. ఇవాళ ఒక్కటి ఇవ్వని బీజేపీ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.గెలిచిన తర్వాత మోసం చేసిన బీజేపీ కి ఓటు ఎందుకు వేయాలన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోరిలో పారేసినట్టు అవుతుందన్నారు. ఇయాళ ఆదే బీజేపీ వాడు మళ్ల పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటారని ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరివి అయిన భూములు గుంజుకుందా..? రైతులకు మేలు చేస్తది తప్ప గుంజుకుంటదా..? దుబ్బాక నియోజకవర్గానికే కాదు యావత్తు తెలంగాణ అసైన్డ్ మెంట్ సోదరులకు తెలియజేస్తున్న..అసైన్డ్ భూములకు మొన్ననే నిర్ణయం చేయడం జరిగిందన్నారు. అసైన్డ్ భూములు గుంజుకునుడు అనేది పచ్చి అబద్ధం అని అన్నారు. బీజేపీ వాళ్లు ఝాటా మాటలు చెప్పుతారని విమర్శించారు. అనేక బాధలు అనుభవించి మొన్ననే విముక్తి అయి..ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నామన్నారు. దీనిని మళ్ల చెడగొట్టుకోవాలా..దుర్మార్గుల చేతిలోకి ఇచ్చి ..దయచేసి తాను చెప్పిన విషయాలు..మీరు గమనించిన వాస్తవాలు అన్నింటిని చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా సన్నిహితుడు..మంచి యోగ్యత ఉన్న వ్యక్తి అని సీఎం కేసీఆర్ చెప్పారు. అతను అడగలేదు దుబ్బాకలో నిలబడతా అని .ఆయన ఎంపీగా ఉన్నారు. మళ్ల కూడా ఎంపీగా గెలుస్తారు. ఆయనకు తానే చెప్పా..దుబ్బాకను కాపాడాల్సిన అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభాకర్ మీరు పోటీకి రావాలని తానే కోరి తెచ్చి పెట్టానన్నారు.
దుబ్బాక ప్రజాఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కూర రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్‌గౌడ్, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జట్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చింతల జ్యోతికృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, సర్పంచ్ల ఫోరం దుబ్బాక మండల అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, భూంపల్లి-అక్బర్పేట మండల అధ్యక్షుడు నగరం రవి, రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, సోలిపేట సతీశ్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, మనోహర్‌రావు, రామవరపు చంద్రశేఖర్‌రెడ్డి, మామిడి మెహన్‌రెడ్డి, సోలిపేట సుజాత, రణం శ్రీనివాస్‌గౌడ్, చిందం రాజ్‌కుమార్, ఎల్లు రవీందర్‌రెడ్డి, రాధాకృష్ణశర్మ, కత్తి కార్తీక, దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని మండలాలకు చెందిన సర్పంచ్‌లు, జట్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
* సీఎం రాకముందు కళాకారుల ఆటపాటలతో సభ మార్మోగింది.
* ఏపూరి సోమన్న పాటలు సభికులను ఆకట్టుకున్నాయి…ఉత్సాహపర్చాయి.
* మంత్రి హరీశ్‌రావు ప్రారంభ స్వాగత ఉపన్యాసం చేస్తుండగా జనం హరీశ్ అన్న జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తించారు.
* సీఎం కేసీఆర్ సభకు వచ్చి కూర్చున్న తర్వాత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రసంగించారు.
* దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ విన్నారు.
* సీఎం కేసీఆర్ సాయంత్రం 5.05 నిమిషాలకు సభాస్థలానికి చేరుకున్నారు.
* సీఎం కేసీఆర్ సభకు వస్తున్న హెలికాప్టర్ చూసి ప్రజలు కేరింతలు కొట్టారు.
* సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ స్వాగతం పలికారు.
* సీఎం కేసీఆర్ స్టేజీ పైకి వచ్చి చేతి ఎత్తి సభికులకు అభివాదం చేయగానే జనం ఈలలు వేశారు
* సీఎం కేసీఆర్‌కు దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి బొట్టు పెట్టారు.
* సీఎం కేసీఆర్‌కు మసీద్ కమిటీ అధ్యక్షుడు ఖలీల్ దట్టీ కట్టారు.
* సాయంత్రం 5.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.
* సీఎం కేసీఆర్ ప్రసంగానికి ఆద్యంతం హర్షధ్వానాలతో యువకులు, ప్రజలుకేరింతలు కొట్టారు.
* సాయంత్రం 5.45నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తిచేశారు
* సీఎం కేసీఆర్‌కు స్థానిక నేతలు జ్ఞాపిక అందజేశారు.
* సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు నాయకులు పోటీపడ్డారు.
* సిద్దిపేట సీపీ శ్వేత ఆధ్వర్యంలో పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు.