పటాన్చెరు రూరల్/కొండాపూర్, మే 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ఆశావహ నిరుద్యోగులకు అందేలా లేదు. రూపాయి ఆదాయం లేకనే ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దమ్మిడి ఆదాయం లేని యువకులకు బ్యాంకుల్లో అకౌంట్లు ఎక్కడివి.? ఉన్నా అవి పైచదువుల కోసం సర్కార్ ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కోసం తెరిచినవి. వాటిలో పెద్దగా లావాదేవీలు ఉండవు.
ప్రభుత్వం ఇచ్చే కార్పొరేషన్ రుణాలకోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు, చిరువ్యాపారులకు ఇప్పుడు బ్యాంకర్ల సిబిల్ స్కోరు తనిఖీ పెద్ద ఆటంకంగా మారుతున్నది. గతంలో అన్ని కార్పొరేషన్ లోన్లను ఎంపికైన వారికి తేలిగ్గా రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు సిబిల్ స్కోరు బావుంటేనే లోన్లు లభిస్తున్నాయి. బ్యాంకరు పెట్టిన ఈ నిబంధన అధికశాతం మంది దరఖాస్తులకు ప్రతిబంధకంగా మారుతున్నది. రాజీవ్ యువ వికాసం పేరున అన్ని కార్పొరేషన్లు సబ్సిడీ రుణాల దరఖాస్తులను ఆహ్వానించాయి.
పటాన్చెరు మండలంలో ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఆశ ఉన్న నిరుద్యోగులు 750మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో ఆశలతో సబ్సిడీ రుణాలు పొంది జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్న నిరుద్యోగుల ఆశలపై సిబిల్ స్కోరు నీళ్లు చల్లుతున్నది. కొందరు చిరువ్యాపారులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి బ్యాంకుల్లో పెద్దగా లావాదేవీలు ఉండవు. వీరి సిబిల్ స్కోరు నామమాత్రంగానే ఉంటుంది. ఇక వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు ప్రభుత్వం అందజేసే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా వస్తున్న రుణాలకోసం ఆశపడితే అంతే సంగతులు. వారి సిబిల్ స్కోరు బ్యాడ్లో ఉంటుంది. వ్యవసాయం వదిలేసి ఏదైనా చిరువ్యాపారం కానీ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు తయారు చేద్దామన్నా రుణం అందదు.
720 సిబిల్ స్కోరు దాటితేనే గుడ్..
బ్యాంకర్లు గుడ్, బ్యాడ్, ఎక్సలెంట్, యావరేజ్ అంటూ సిబిల్ స్కోరు నిర్ణయిస్తున్నాయి. ఆధార్‌కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు కేవైసీ చేసి వాటి ద్వారా నిరుద్యోగులు, రైతులు, చిరు వ్యాపారులు సిబిల్ స్కోరు ర్యాంకులను నిర్ణయిస్తారు. క్రెడిట్ కార్డు వాడేవారికి, పెద్ద వ్యాపారులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సిబిల్ స్కోరుపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. సిబిల్ స్కోరు పడిపోకుండా వారు డబ్బులను రొటేషన్ చేస్తారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరిచిన వారికి మైనస్ 1 ర్యాంకింగ్ ఇచ్చి చిన్నపాటి రుణం మాత్రం ఇస్తారు.
ఫోన్ యాప్స్‌ల్లో లోన్లు తీసుకున్నవారికి, క్రెడిట్‌కార్డు లోన్లు ఉన్నవారికి, డీఫాల్ట్ ఉన్నవారికి సిబిల్ స్కోరు తక్కువగానే ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసిన వారికి ఆదాయం ఉండదు. ఆ ఆదాయ మార్గాలు, ఉపాధి మెరుగు పర్చుకునేందుకే కార్పొరేషన్ లోన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పటాన్చెరు మండలంలో అన్ని కార్పొరేషన్లకు కలిపి 750దరఖాస్తులు వచ్చాయి. బీసీ కార్పొరేషన్‌కు 424, ఈబీసీలు 103, మైనార్టీలు 55, ఎస్సీలు 209, ఎస్టీలు 14 దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో అధిక శాతం దరఖాస్తులు సిబిల్ స్కోరు కారణంగా రుణం రాకుండాపోవచ్చు.
సిబిల్ స్కోరుతో లింక్ పెట్ట్టొద్దు
రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంక్ సిబిల్ స్కోరుతో ముడి పెట్టవద్దు. ఆ విధంగా చేస్తే అసలైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే బ్యాంక్ బాధితులుగా మారిన ఎంతోమంది పేదలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోరు తగ్గుతుంది. దీంతో వారికి రుణం మంజూరయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అర్హులైన వారికి రుణం అందేలా ప్రభుత్వం చూడాలి.
– ఎండీ జలీల్, కొండాపూర్ (సంగారెడ్డి జిల్లా)