జహీరాబాద్, డిసెంబర్ 20: మార్కెట్లో క్రిస్మస్ సందడి నెలకొన్నది. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తుండతో క్రైస్తవులు సన్నాహాలను ముమ్మరం చేశారు. క్రైస్తవులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు చర్చిలు సర్వం సిద్ధం చేస్తున్నారు. క్రిస్మస్ పండగకు ముందు నిర్వహించే ప్రీ క్రిస్మస్ వేడుకలు జోరుగా నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలోని మెథడిస్టు చర్చితో పాటు నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల్లోని చర్చిలు విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్నాయి. క్రిస్మస్ వేళ షాపింగ్ మాల్స్ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. క్రైస్తవులు, సంఘాల ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
క్రీస్తు పుట్టుకను సూచించే నక్షత నమూనాలను క్రైస్తవులు పండగకు కొద్ది రోజుల ముందు నుంచే ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్నారు. చర్చిల ముందు క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. దీంతో మార్కెట్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. బెలూన్స్, అలంకరణ వస్తువులకు వ్యాపారులు ధరలు పెంచారని క్రైస్తవులు తెలిపారు. క్రిస్మస్ పండగకు పది రోజుల ముందు నుంచే క్రైస్తవ సంఘాలు క్యారెల్స్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 6 నుంచి క్యారెల్స్ బృందం పర్యటిస్తున్నది. భక్తీ గీతాలు, వాయిద్యాల హోరుతో క్రైస్తవులు ఇండ్లను సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు.
జహీరాబాద్ పట్టణంలో ఉన్న షాపింగ్ మాల్స్ క్రైస్తవులతో కిటకిటలాడుతున్నాయి. క్రిస్మస్ పండుగ కోసం ప్రజలు షాపింగ్, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. క్రిస్మస్ పండగ కోసం క్రైస్తవులు ఉత్సహంగా కేక్‌లను కట్ చేస్తారు. వ్యాపారులు భారీగా కేక్‌లు తయారు చేసి అమ్మకాలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. బేకరీ యజమానులు ముందుగానే ఆర్డర్లు తీసుకుని కేక్‌లు తయారు చేసేందుకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. క్రిస్మస్ పండగ సమీపిస్తుండంతో క్రైస్తవులు చర్చిలకు విద్యుత్ దీపాలు, రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ ముందు క్రిస్మస్ తాతా (సాంబాక్లాజ్) బొమ్మలు భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. క్రిస్మస్ పండగ కోసం జహీరాబాద్ పట్టణంలో ఉన్న ప్రధాన చర్చిలు సుందరంగా ముస్తాబు చేగా, విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. చర్చిల ముందు బెలూల్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.