సంగారెడ్డి జూన్ 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి దమ్ముంటే మీనాక్షి నటరాజన్‌కు ద్రోహం చేసిన ఇంటిదొంగ పేరు బయటపెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ నామినేషన్ ప్రక్రియ జరగకుండా సొంత పార్టీ నాయకుడు అన్న విషయం అందరికీ తెలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్పై బురదజల్లే ముందు జగ్గారెడ్డి సొంతపార్టీలోని అంతర్గత కమ్ములాటలపై సమాధానం చెప్పాలన్నారు. మీనాక్షి నటరాజన్‌కు ద్రోహం చేసింది సొంత పార్టీ నాయకులేనని హరీశ్‌రావు అంటే జగ్గారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ మంత్రులే ఆధారాలతో సహా మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులే సమాచారం ఇచ్చారని కుండబద్ధ్దలు కొడితే, దానికి సమాధానం చెప్పేదమ్ము జగ్గారెడ్డికి ఎందుకులేదని నిలదీశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు ఊహాగానాలు కావని, ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను ప్రజలు ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. మీనాక్షి నటరాజన్‌కు ద్రోహం చేసింది ముఖ్యమంత్రి వర్గమే అని తెలిసినా జగ్గారెడ్డి నోరు ఎందుకు మెదపడంలేదు, ఎవరు మీ నోరు నొక్కేశారు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కోసం రూ.100 కోట్ల గెస్ట్ హౌస్, యూనిఫామ్ టెండర్ల అవినీతి, హెలికాప్టర్ అద్దె ఖర్చులు వంటి అంశాలపై హరీశ్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటమిపాలైన జగ్గారెడ్డికి ప్రజల గుండెల్లో ఉంటూ ఆరుసార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్‌రావును విమర్శించే అర్హత లేదన్నారు. హరీశ్‌రావు రైతులు, పేదల పక్షాన పోరాడుతూ ప్రజల మధ్యనే ఉండే నాయకుడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ వాళ్ల కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకున్నారని తెలిపారు కాంగ్రెస్‌లో కోవర్టులు ంటే తోడ్కలు తీస్తామని ప్రగల్భాలు పలుకుతున్న జగ్గారెడ్డికి రేవంత్‌రెడ్డి అనుచరుడి పేరు బయటపెట్టాలన్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీ కోవర్టు అని కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు వచ్చిన బ్లాక్‌మెయిలర్ అని గాంధీభవన్ మెట్ల మీద కూర్చుని తిట్టిన జగ్గారెడ్డి ఇప్పుడు పదవులు కాపాడుకునేందుకు సీఎం వంతపాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.