మెదక్ రూరల్ నవంబర్ 14 : బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ సిడిపిఓ వెంకటరమణమ్మ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మున్సిపాలిటీలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం జరిపిస్తే మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని వారు పేర్కొన్నారు.
వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండరని వైకల్యం కలిగి ఉంటారనే విషయాన్ని తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు బాల్య వివాహం చేయరాదని, దీనిని అందరూ ముక్తకంఠంతో ఖండించి వయస్సు నిండే వరదాకా వేచి చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు మాధవి, శ్రీ దేవి, మున్సిపాలిటీ టీపీవో భూపతి, డి ఈ మహేష్, భవాని, డిహెచ్ఈ డబ్ల్యూ నాగమణి, తదితరులున్నారు.