పటాన్చెరు, డిసెంబర్ 21 : మార్కెట్లో కోడి మాంసం ధర కొండెక్కింది. రెండువారాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత నెలతో పోలిస్తే మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పదిహేను రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ. 200 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ. 270 కిలో విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ధరాఘాతంగా మారింది. కార్త్తిక మాసం ముగియడం, డిమాండ్ పెరగడంతో చికెన్ ధర అమాంతం పెరిగింది. ప్రతివారం ధర రూ.20పై పెరుగుతున్నది. చికెన్ ధరలు పెరిగిపోవడానికి కోళ్ల ధరలు భారీగా పెరిగిపోవడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
అవసరమైన కోళ్లు జిల్లాలో లేకపోవడంతో వ్యాపారులు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా భారం పెరిగిపోవడంతో వ్యాపారులు కోళ్ల ధరలు పెంచారు. లైవ్ కోడి కిలో గతంలో రూ.110 నుంచి రూ. 120 వరకు ఉండగా, అందుకు అనుగుణంగా చికెన్ ధరలతో అమ్మకాలు చేశామని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో కోళ్ల ధరలు పెరిగిపోవడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కోడిగుడ్ల ధరలు సైతం పెరిగాయి. నవంబర్లో ఒక కోడి గుడ్డు ధర రూ. 5 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు రూ. 8 అమ్ముతు న్నారు. గుడ్ల వినియోగం పెరిగిపోవడం, ఉత్పత్తి లేకపోవడంతో గుడ్ల్లను వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.