తూప్రాన్, ఏప్రిల్ 10: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధుడిని మెదక్ జిల్లా తూప్రా న్ వైద్యులు కాపాడారు. తూప్రాన్ సామాజిక దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ అమర్ సింగ్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రా మానికి చెందిన మల్లయ్య షుగర్ టెస్ట్ కోసం కుమారుడితో కలిసి తూప్రాన్ సామాజిక దవాఖానకు శుక్రవారం ఉదయం వచ్చాడు.
పరీక్షల అనంతరం మల్లయ్య సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో చికెన్ తింటుండగా గొంతు లో ముక్క ఇరుక్కోవడంతో వెంటనే ఊపిరాడక కిందపడిపోయాడు. వెంటనే గమనించిన కుమారుడు తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు మల్లయ్యను తీసుకువచ్చాడు. వెంటనే స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ అమర్‌సింగ్, వైద్య బృందం, దవాఖాన సిబ్బందితో కలిసి విజయవంతంగా చికెన్ ముక్కను తొలిగించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్లు సకాలంలో స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని, నిమిషం ఆలస్యమైనా మల్లయ్య బతికేవాడు కాదని కుటుంబ సభ్యులు డాక్టర్ అమర్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.