సదాశివపేట, సెప్టెంబర్ 24 : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని సిద్దాపూర్ శివారులోని అరేన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం కెమికల్ లీకై నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న శివారెడ్డి, శ్రీనివాస్, దివాకర్, సింహాచలం కార్మికులపై ఒక్కసారిగా కెమికల్ లీకై ఒంటిపై పడింది.
దీంతో కార్మికుల ముఖా లు, చేతులు, కాళ్లు, శరీర భాగాలు కాలిపోయాయి. గాయాలైన కార్మికులను సంగారెడ్డిలోని బాలాజీ దవాఖానకు తరలించారు. గాయపడిన కార్మికుల పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించాలని డాక్టర్ శ్రీధర్ సూచించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మా ణిక్యం చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు.