చౌటకూర్, మే 15: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని చక్రియాల్‌లో బుధవారం తడిసిన ధాన్యాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల జైపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందుచూపు లేదని, వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సూచనలు, సలహాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎలాంటి ప్రణాళికలు లేకుండానే కొనుగోలు కేంద్రాల్లో ఇష్టానుసారంగా ధాన్యం నిల్వలు ఉంచడంపై నిరసన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంపై అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఒక్కసారి కూడా సమీక్షా నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. ధాన్యం సేకరణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, మొద్దునిద్ర పోతున్నారని మండిపడ్డారు. తూకం వేసిన బస్తాలు సైతం వర్షం ధాటికి తడిసిపోయాయని, రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో జాప్యం చేస్తున్నారని, లారీల కొరత కారణంగా ధాన్యం రాశులన్నీ నీటిపాలయ్యాయని చంటి క్రాంతికిరణ్ విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రైతులకు ఎదురు కాలేదని గుర్తుచేశారు. మంత్రి దామోదర హైదరాబాద్‌కు పరిమితం అయ్యారని, రైతుల సమస్యలు ఆయనకు పట్టడం లేదని విమర్శించారు.
అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయారని క్రాంతికిరణ్ మండిపడ్డారు. సిమెంట్ లైనింగ్ పేరుతో సింగూరు ఎడమ ప్రధాన కాలువకు నీళ్లు వదలకుండా క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులను ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ గాజుల వీరేందర్, సర్పంచుల ఫోరం ఉమ్మడి పుల్కల్ మండల అధ్యక్షుడు బక్కారెడ్డి కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, నాయకులు తుంగె అనంతయ్య, ఆర్.మల్లేశం, తుంగె మల్లేశం, కొత్తగొల్ల రవి, డాకూరు అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.