సంగారెడ్డి, జూలై 20(నమస్తే తెలంగాణ): భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్ల ఎకానమీ సాధించటమే లక్ష్యమని ఈ లక్ష్య సాధనలో ఐఐటీలు, దేశంలోని యూనివర్సిటీలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 2047 నాటికి ఆమెరికాను మించి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలంటే భారత్ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు దేశంలోని ఐఐటీలు, 1200 యూనివర్సిటీలు, 4.50 కోట్ల మంది విద్యార్థులు, 15 లక్షల మంది బోధనా సిబ్బంది కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న యువ విద్యార్థులు, బోధనా సిబ్బంది కష్టపడితే వికసిత భారత్ సాధ్యపడటమే కాకుండా అందరూ కలిసి వికసిత భారత్‌లో జీవించవచ్చని తెలిపారు.
భారతదేశం రోటీ, కప్డా, మకాన్ నినాదం నుంచి ముందుకు వచ్చిందన్నారు. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉన్న భారత్, అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ సాధించాలంటే సోషియో ఎకానమీ ట్రాన్స్ఫార్మరేషన్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం భారతదేశం స్టార్టప్ క్యాపిటల్‌గా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానంగా భారత్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్‌టెక్, సెమీకండక్టర్ రంగాల్లో అగ్రస్థానానికి చేరుకోవాలని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు భారత ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్, నేషనల్ మిష న్ ఆన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తదితర కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రైవేటు రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపా యల నిధులను కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పాలసీలు, ప్రోత్సాహాకాలతో రాబోయే రోజుల్లో ఇండియన్ డైనమిక్ టెక్నాలజీ ఇండస్ట్రీ 350 బిలియన్ డాలర్ మార్క్ దాటుతుందని తెలిపారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రం గంలో మరింత పరిశోధనలు జరగాలని, ఇందుకోసం యూనివర్సిటీలు, ప్రైవేటు పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఐఐటీ హైదరాబాద్ అతి తక్కువ సమయంలో మంచి స్థానంలో ఉందని, ఇక్కడి నుంచి ప్రముఖ 50 స్టార్టప్ కంపెనీలు రావటం హర్షనీయమని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లు, తక్కువ ధర పీపీఈకిట్లు, లోకాస్ట్ వెంటిలేటర్ల తయారీలో ఐఐటీహెచ్ కీలకభూమిక పోషిచిందని కొనియాడారు.
ఐఐటీహెచ్ పాకలవర్గం చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..ఐఐటీ హైదరాబాద్ మిగతా ఐఐటీలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతునట్లు చెప్పారు. ప్రధానంగా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక్కడి విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 13వ స్నాతకోత్సవంలో భాగంగా 1103 మంది బీటెక్, ఎం టెక్ విద్యార్థులు పట్టాలు అందజేశారు. నలుగురు వి ద్యార్థులు గోల్డ్ మెడల్ అందుకోగా, 38 మంది విద్యార్థులు సిల్వర్ మెడల్ అందుకున్నారు.
ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..రెండోత రం ఐఐటీ ర్యాంకింగ్‌లో ఐఐటీ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐఐటీహెచ్‌లో మొదటిసారి బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటెక్ సెమీకండక్టర్ మెటీరియల్ అండ్ డివైజెస్, ఎంటెక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, ఎంటెక్ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఐఐటీహెచ్ సెమీకండక్టర్ రంగంలో త్వరలోనే లీడర్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే సెమీకండక్టర్ రంగానికి సంబంధించి 620 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు.