Kandi | జహీరాబాద్, మార్చి 23 : మనిషి తన సహజ స్వభావాన్ని వీడడం ద్వారా అనుకున్న లక్షాలను చేరుకోలేరని కంది ఇస్కాన్ టెంపుల్, అక్షయ పాత్ర బాధ్యులు శ్రీ విభిషణ్ ప్రభు ఉపదేశించారు. సహజ సిద్దమైన స్వభావం కలిగిన పశు పక్షాదులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయని, మేధస్సు, విజ్ఞానం కలిగిన మానవాళి ప్రకృతి కి విరుద్ధంగా నడుచుకోవడం పట్ల ఆయన ఆవేదన వెలిబుచ్చారు. 147 వ హరేకృష్ణ నగర సంకీర్తన స్థానిక హమాలీ కాలనీలోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది.
ఈ సందర్బంగా ఏర్పాటైన సత్సంగ సమావేశంలో ఆయన అనుగ్రహభాషణం చేశారు. కాలనుగుణంగా పశు పక్షాదులు తమ జీవన శైలిని తామే నిర్మించుకొంటాయని, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనిషి తన జీవన విధానాన్ని నిర్మించుకోలేక పోతున్నాడని పేర్కొన్నారు. క్షత్రియుడిగా ఉండి కూడా అర్జునుడు యుద్దానికి సిద్ధం కాకపోవడంతోనే శ్రీ కృష్ణుడు భగవద్గీత ఉపదేశించాల్సి వచ్చిందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనిషి ధైవాత్వానికి దగ్గరవుతాడని, ఈ క్రమంలోనే చైతన్య ప్రభు, శ్రీల ప్రభు పాదుల వారి స్ఫూర్తితో హరేకృష్ణ నగర సంకీర్తన ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్బంగా జన్మదినం జరుకొంటున్న భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తూనే పలు జంటలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అంతకుముందు వందలాది కృష్ణ భక్తులు హమాలీ కాలనీ వీధుల్లో శోభా యాత్ర నిర్వహించి, కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు.