శివ్వంపేట, ఫిబ్రవరి 21 : మొదటి విడతలో రోడ్డు పనులు పూర్తికావడంపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ బీటీ రోడ్డు శిథిలావస్థకు చేరి గుంతలతో కొన్నేళ్లుగా అవస్థలు ఎదురుకున్న ప్రజలు, ప్రయాణికులు మొదటి విడత రోడ్డు పూర్తి కావడంతో అవస్థలకు స్వస్తి పలికారని తెలిపారు.
గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో నిధులు మంజూరు కావడంతో శివ్వంపేట మండలం ఉసిరికపల్లి, భీమ్లతండా, శంకర్‌తండా, పాంబండ, పోతులబొగుడ గ్రామాల ప్రజలకు అప్పటి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. మొదటి విడుతలో రోడ్డు పనులు ప్రారంభమై పనులు నత్తనడకన సాగడంతో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై అధికారులను ఎప్పటికప్పుడు రోడ్డు పనులపై ఆరా తీసి పనులను వేగవంతం అయ్యేలా కృషి చేసినందుకు పరిసర గ్రామాల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలోనే మండలంలోని థౌర్యతండాకు బీటీరోడ్డు నిర్మాణ పనులకు రూ. 1.54 లక్షలు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. రెండో విడతలో చండి గ్రామం నుంచి గోమారం మీదుగా అనంతారం చౌరస్తా వరకు రోడ్డు పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉసిరికపల్లి మాజీ సర్పంచ్ మర్రి గోపాల్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యులు పోతరాజు లింగం తదితరులు ఉన్నారు.