సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 30:‘అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లండి’.. ఇది ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం, జాతర ఏర్పాట్లపై శనివారం సిద్దిపేట పట్టణ శివారులోని ఓ హోటల్లో మంత్రి అధ్యక్షతన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే పల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
“అంతా మా ఇష్టం. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లండి”.. అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికారిక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎలా ఉంటారని ఎమ్మెల్యే ప్రశ్నించినందుకు మంత్రి బదులిచ్చిన తీరిది. కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం, జాతర ఏర్పాట్లపై సిద్దిపేటలోని హరిత మినర్వా హోటల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారిక సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. దీనిపై ఎమ్మెల్యే పల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. మీరు ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లండి అని మంత్రి వ్యాఖ్యానించడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మరికొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
ఆచార, సంప్రదాయాలకు వ్యతిరేకంగా సమావేశం: ఎమ్మెల్యే
కొమురవెల్లి మల్లన్న జాతరకు సంబంధించిన సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం విడ్డూరమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మల్లన్న జాతరకు తాము సహకరించినా, మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన సమావేశాన్ని ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఒక కమర్షియల్ ప్రదేశంలో సమీక్షించడం తగదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలోనే సమావేశం నిర్వహించారన్నారు. ఓడిపోయిన నాయకులను తీసుకొచ్చి సమావేశంలో కూర్చోబెట్టడం దురదృష్టకరమన్నారు. దేవుడి సేవకులుగా తాము మల్ల న్న కల్యాణం, జాతరలో పాల్గొంటామన్నారు. ప్రజ లు ఎన్నుకున్న తమను ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇగోలు, ప్రొటోకాల్ లేకుండా మల్లన్న కల్యా ణం, జాతరలో స్వచ్ఛందంగా తాము సేవ చేస్తామన్నారు. దేవాలయంలో కూడా రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఖండి స్తూ తాము సమావేశాన్ని బహిష్కరించామన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. జనవరి 7 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరిగే మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంబంధిత శాఖలు ఏర్పాట్ల కోసం ప్రతిపాదనలు పంపితే ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించి శాశ్వత పద్ధతిలో ఏర్పాట్లు చేస్తామన్నారు. కొమురవెల్లిలో శాశ్వత ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. సూచిక బోర్డులు, అనౌన్స్మెంట్ మైకులు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు వృద్ధులు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, వృద్ధులు, గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. జనవరి 3వ తేదీ వరకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమురవెల్లి ఆలయాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాసరావు, పోలీస్, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.