సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30 : ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ తన గురువుకు సాష్టాంగ నమస్కారం చేశారని, ఒక గురువుకు ఇంతకంటే కావాల్సింది ఏమీ ఉండదని, గురువులంటే కేసీఆర్‌కు ఎంతో గౌరవమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ శుభాకర్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది ఉపాధ్యాయ వృత్తి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు కూడా రైతుబంధు, రుణమాఫీ పథకాలు అమలయ్యాయని, ఇప్పుడు వాటితోపాటు పీఆర్సీలు, డీఏ, ఫిట్మెంట్లు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 73 శాతం ఫిట్మెంట్ అందించామని తెలిపారు. మార్చిలో రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు రిటైర్మెంట్ డబ్బులు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఎల్ఐసీ డబ్బులు రాలేదన్నారు.