గుమ్మడిదల, ఫిబ్రవరి 6: ఆరోగ్య మంత్రి గారూ.. మా ఆరోగ్యాలను పాడు చేయొద్దు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహను బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. మహానగరం చెత్తతో మా అనారోగ్యాలకు కారణం కావొద్దంటూ అఖిలపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం గుమ్మడిదలలో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రహదారిపై ర్యాలీగా వచ్చారు. దీనికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హాజరై నాయకులతో కలిసి డంపింగ్‌యార్డు వద్దంటూ అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుమ్మడిదల, నర్సాపూర్, శివ్వంపేట మండలాల ప్రజలకు డంపింగ్ యార్డుతో ప్రమాదం ఉందన్నారు.
కాంగ్రెస్ సర్కారు డంపింగ్ యార్డు ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయం లేకుండా రేవంత్ సర్కారు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం అంటే ఇదేనా ప్రజాపాలనా? అని మండిపడ్డారు. వ్యవసాయం చేసుకుని బతికే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా యువ నాయకులు వెంకటేశం గౌడ్, మాజీసర్పంచ్ నర్సింహారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, మొద్దు సర్కారుకు నిరసనగా రహదారిపై మొద్దును కాల్చి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారుల వద్దకు చేరుకొని చెదరగొట్టారు.
డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కగా, మరో యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు వద్ద పోలీస్‌లు, సీఆర్పీఎస్ సిబ్బంది బారికేడ్లు పెట్టి అటువైపు ఎవరూ రాకుండా ఏఎస్పీ సంజీవ్‌రావు పర్యవేక్షణలో పహారా కాస్తున్నారు. గుమ్మడిదల మున్సిపల్‌తోపాటు మంభాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి ఆందోళనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు బంద్‌కు పిలుపునివ్వడంతో బొంతపల్లి, గుమ్మడిదల, దోమడుగు, మంభాపూర్ తదితర గ్రామాల్లో స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి మద్దతుగా నిలిచారు.