సిద్దిపేట, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ కమిటీలా..? కాంగ్రెస్ కమిటీలా..? ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నేతల పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. గ్రామసభల నిర్వహణ లేదు. ఎవరికీ సమాచారం లేకుండానే కాంగ్రెస్ నేతలకు నచ్చిన పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 80శాతానికిపైగా జాబితాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈనెల 11న ప్రభుత్వం గ్రామాల్లో, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. రెండు రోజుల్లోనే ఇందిరమ్మ కమిటీలను పూర్తి చేయాలని ఆ జీవోలో ఆదేశాలు ఇచ్చింది. అంటే 11,12 తేదీల్లోనే ముగించాలని స్పష్టంగా చెప్పింది.
ఆ జీవో ప్రకారం ఎక్కడ కమిటీలు వేయడం లేదు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి ఆయా మండలాల ఎంపీడీవోలకు, మున్సిపల్లో కమిషనర్‌కు పంపించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతుంది మరోటి. ‘ప్రజాపాలన, పారదర్శకత పాలన సమాజంలోని అన్ని వర్గాల స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రుల నుంచి సీఎం దాక ఊకదంపుడు ఉపన్యాసం ఊదరగొడుతున్నారు.’ తమది పారదర్శక ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీల పేర్లను గ్రామసభ ఆమెదం లేకుండా ఎలా వేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి దానికి గ్రామసభను నిర్వహించి గ్రామసభలో చర్చించిన అనంతరం కమిటీల పేర్లను పంపడం ఆనవాయితీ.
కానీ, కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా తమ పార్టీ నేతల పేర్లను రాసుకొని వాటిని ఆమోదించుకునే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామాలు, వార్డుల నుం చి కాంగ్రెస్ నేతలు పేర్లను తెప్పించుకుంటున్నారు. గ్రామ, మండల, మున్సిపాలిటీల వారీగా తెప్పించుకొని నియోజకవర్గ ఇన్చార్జికి లేదా అక్కడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అందిస్తున్నారు. వీటన్నింటినీ జిల్లా మంత్రుల ద్వారా కలెక్టర్‌కు పంపించి ఆమోదింపజేయనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానా లు ఉంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న చోట వారి చెప్పిన పేర్లను ఫైనల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆరుస్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిల ద్వారా పేర్లు తెప్పించుకొని వాటిని ఆమెందింపజేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను కాదని ఎలాంటి అర్హత లేని వారి లిస్టులను ఎలా ఆమోదం తెలుపుతారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. గ్రామ సభలు పెట్టకుండా ఇందిరమ్మ కమిటీలు ఎలా ఏర్పా టు చేస్తారని బీఆర్ఎస్ శ్రేణలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయనున్నారు. అంటే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తొలివిడుతలో సుమారుగా 40 వేల ఇండ్ల వరకు మంజూరుకానున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, జనగామ, మనకొండూరు నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉండగా 5 మున్సిపాలిటీల పరిధిలో 115 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాకు సుమారుగా 14 వేల ఇండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో 491 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 75 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మెదక్, నర్సాపూర్, అందోల్, నారాయణ్‌ఖేడ్, దుబ్బాక శాసనసభ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలో 9 వేల ఇండ్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణ్‌ఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలో 647 గ్రామ పంచాయతీలుండగా ఎనిమిది మున్సిపాలిటీల్లో 199 వార్డులున్నాయి.
సుమారుగా ఇక్కడ 17,500 వరకు రావచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 45 వేల ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు సైతం ధ్రువీకరణ పత్రాలు సైతం అందజేసింది. ప్రభుత్వ మారగానే వాటిని పూర్తిగా రద్దు చేసి ఆ లబ్ధిదారులను ఆగం చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే కొంతమంది ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. మరికొంత మంది వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని ఇంటి నిర్మాణాలు చేసిన వాటికి, వివిధ దశల్లో ఉన్న వాటికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆ లబ్ధిదారులు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటయ్యే ఇందిరమ్మ కమిటీకి చైర్మన్‌గా ఆ గ్రామ సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటారు. వీరితోపాటు ఇద్దరు స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్న మరో ముగ్గురితో కమిటీలు ఏర్పాటు చేయాలని జీవోలో సూచించారు. ఆ ముగ్గురిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గాల నుంచి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
మున్సిపల్ వార్డు కమిటీ చైర్మన్‌గా ఆ వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌ను, కన్వీనర్‌గా వార్డు ఆఫీసర్‌ను నియమిస్తారు. వీరితోపాటు ఇద్దరు స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఉన్న మరో ముగ్గురితో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ముగ్గురిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గాల నుంచి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
కమిటీలు కార్యక్రమంపై నిరంతం అవగాహన కల్పిస్తాయి. ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షిస్తాయి. సోషల్ ఆడిట్ కమిటీగా వ్యవహరిస్తోంది. ఎవరైనా లబ్ధిదారులు పొరపాటున జాబితాలో చేరి ఉంటే వారిని తొలిగించాల్సిందిగా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్‌కు నివేదిస్తుంది. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ జాబితాలో చేర్చాల్సిన లబ్ధిదారుల పేర్లను కలెక్టర్‌కు నివేదిస్తుంది. ఆ తర్వాత కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రితో సంప్రదించి ఇందిరమ్మ కమిటీలను ఖరారు చేస్తారు. ఇందిరమ్మ కమిటీలను ఖారారు చేసి మండలాలు, మున్సిపాలిటీల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఎక్కడ కూడా జీవో ప్రకారం కమిటీల ఏర్పాటు కాలేదు.