సిద్దిపేట, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అరకొర రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండిచెయ్యి చూపింది. విడతల వారీగా మూడు విడతల్లో రైతులందరీ రుణమాఫీ చేశామని సీఎం నుంచి మంత్రుల వరకు గొప్పలు చెప్పకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కానీ, పరిస్థితి వేరేలా ఉంది. సగం మంది రైతులకు రుణమాఫీ వర్తించక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా 50శాతం రుణాలు మాఫీ కాలేదు. రైతులు తమకు రుణమాఫీ కాలేదని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కనీసం అధికారిక జాబితా విడుదల చేయలేని దుస్థితిలో అటు బ్యాంకర్లు, ఇటు వ్యవసాయ అధికారులు ఉన్నారు. గ్రీవెన్స్ సెల్‌కు రైతులు ఫిర్యాదులు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైతులు రుణమాఫీ కాలేదని రోడ్డెక్కుతున్నారు. రైతు ప్రభుత్వమే ధ్యేయం పదేండ్లు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. రైతులకు దన్నుగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలిచి గ్రామాల వారీగా రుణమాఫీ కానీ రైతుల వివరాల సేకరణకు బీఆర్ఎస్ సిద్ధ్దమైంది. ఇందులో భాగంగా మంగళవారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ముఖ్యనేతలు సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు హాజరయ్యారు.
గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా బుధవారం నుంచి బీఆర్ఎస్ శ్రేణలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా జాబితాలను రూపొందిస్తారు. రూపొందించిన జాబితాను పార్టీ అధిష్టానానికి అందజేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాచరణకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సిద్దిపేట పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ సభలతో భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిద్దిపేట బ్లాక్ ఆఫీసు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు, ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీల సభలతో మంగళవారం సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల కిందట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి ఫ్లెక్సీలు చించివేయడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఆరోజు నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో రుణమాఫీపై సన్నాహాక సమావేశాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. అటు కాంగ్రెస్ నాయకులు రైతు రుణమాఫీ అభినందన ర్యాలీతో పాటు రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో ర్యాలీకి పిలునిచ్చారు.
మల్కాజ్‌గిరీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తమ మద్దతు దారులతో సిద్దిపేటకు వచ్చారు. దీంతో రెండు పార్టీల సభలు సమావేశాలతో సిద్దిపేట పట్టణంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తమ నేతలతో కార్యాచరణ సమావేశంలో పాల్గొన్నారు. అటు ఇతర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలతో ర్యాలీకి ప్లాన్ చేసింది. బ్లాక్ ఆఫీసు చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదుగా పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ ర్యాలీ తీయాలని తలిచింది.
ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం మీదుగా పోతే గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు కాంగ్రెస్ ర్యాలీ రూట్‌ను మార్చారు.అప్పటికే క్యాంప్ కార్యాలయం వైపు వెళ్ల్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు వైపు వెళ్లే మార్గం పూర్తిగా బ్లాక్‌చేశారు. క్యాంప్ కార్యాలయం మీదుగా కాకుండా ఇతర మార్గం గుండా పాత బస్టాండ్ వరకు తీసుకుపోయారు. ఇటు బీఅర్ఎస్ నాయకులు క్యాంప్ కార్యాలయంలో తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రెండు పార్టీల సమావేశాలకు అంటకం కలగకుండా ఎవరి పరిధిలో వారు నిర్వహించుకునేలా పోలీసులు పక్కాగా ప్లాన్ చేయడం తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.