కొమురవెల్లి, మే 19: వరంగల్- నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదివారం బీఆర్ఎస్ కొమురవెల్లి మండల నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంచిన విషయాన్ని గుర్తు చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చిన ఉద్యోగాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో సైతం అనేక ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇవ్వడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ వేస్తామని ఉద్యోగ, నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఏర్పుల మహేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కీషన్, గొల్లపల్లి కిష్టయ్య(జీకే), అన్నేబోయిన రవీందర్, కొండ శ్రీధర్, స్వాములపల్లి కనకచారి, బొడిగం వంశీ, గొల్లపల్లి నాగరాజు, కొడిసెల రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.