సిద్దిపేట, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊరురా గులాబీ జెండా పండుగకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. నేడు గ్రామాల్లో జెండా పండుగ చేసుకొని అక్కడి నుంచి ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ప్లీనరీ సమావేశాలకు పార్టీ క్యాడర్ హాజరవుతారు. ఈ మేరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశాలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పార్టీజిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. పార్టీ పండుగను అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. అదే రోజు ఉదయం ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. పల్లె పల్లెనా పండుగలా జెండా ఆవిష్కరించి నియోజకవర్గ ప్లీనరీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో ప్లీనరీ సభకు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు చేస్తున్నారు. సుమారు ఒక్కో ప్లీనరీ సమావేశానికి ఐదు వేల మంది హాజరుకానున్నారు. ఆదిశగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 22 ఏండ్ల పార్టీ ఆవిర్భావం, 9 ఏండ్ల ప్రగతి ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేలా ఇప్పటికే వివిధ రాష్ర్టాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజాధారణ, మద్దతు వస్తున్న విషయం తెలిసిందే. నాడు పార్టీ ఆవిర్భావం చేసి.. అనతి కాలంలోనే దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు అందిస్తుంది. పేద ప్రజలకు, రైతులకు చేస్తున్న పథకాలు గొప్పవి.. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని దేశ ప్రజలు నేడు కోరుకుంటున్నారు. ఆదిశగానే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. 22 ఏండ్ల ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోబోతున్నాం. ప్లీనరీలో పలు తీర్మానాలు చేయబోతున్నారు. ప్రధానంగా రైతు సంక్షేమం, దళితబంధు, మహిళా సంక్షేమం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. బీజేపీ పాలనలో పెరిగిన ధరలు, తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేస్తున్న అన్యాయాలు వంటి అంశాలు ఉండనున్నాయి.
సీఎం కేసీఆర్ సారథ్యంలో అనతికాలంలోనే జరిగిన సమగ్ర అభివృద్ధి, అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు, సచివాలయ నిర్మాణం, నూతన కలెక్టరేట్ల నిర్మాణాలు తదితర అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బహిరంగ వేదికకు వచ్చే దారిలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. నాడు నేడు ఫొటోలను ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు పదర్శిస్తారు. ఆయా నియోజకవర్గాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ఒక కాపీ లేదా బుక్లేట్తో కూడిన ఒక కిట్‌ను తయారు చేసి సభకు వచ్చే వారికి అందించనున్నట్లు సమాచారం.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పలు తీర్మానాలు
జిల్లాలో 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా కాళేశ్వరం ప్రాజెక్టులు ,మిషన్ కాకతీయ, పంట కొనుగోలు కేంద్రాలు, ధరణి, భూముల ధరలు, వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతా తీర్మానం చేస్తారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, బోధకాల బాధితులు, డయాలసిస్ రోగులకు పెన్షన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం, దేశంలో ఎక్కడాలేని మనవీయ పాలన, మిషన్‌భగీరథ ఇంటింటికీ నల్లా నీళ్లు, షీటీమ్స్ కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అమ్మఒడి వాహనాలు ఆరోగ్య మహిళా క్లినిక్‌లు, ఒంటరి మహిళలు వితంతు పెన్షన్లు, బాలికల గురుకులాలు పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు స్థానిక సంస్థల్లో మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, బతుకమ్మ చీరెలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ సభ తీర్మానం చేస్తుంది. కుల వృత్తులకు పునరుజ్జీవం గొర్రెలు, చేపల పంపిణీ చేనేతకు చేయూత నేతన్నకు బీమా సెలున్లకు ఉచిత కరెంట్, దోబీఘాట్లు, ఆధునీకరణ, తాళ్లపన్ను రద్దు నేత గీత కార్మికులకు పెన్షన్లు, రూ. 5 లక్షల బీమా, హైదరాబాద్‌లో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు, బహుజన బాంధవుడు సీఎం కేసీఆర్.
భూములకు పట్టాలు హైదరాబాద్‌లో బంజారా భవన్ ఆదివాసీ భవన్, ఎస్టీ గురుకులాలు, కొండల్లో అడవుల్లో ఆవాసాలకు మిషన్ భగీరథ నీళ్లు గిరిజన జీవితాల్లో ప్రగతి వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్. విద్యాఉద్యోగంలో వెయ్యికి పైగా గురుకులాలతో విద్యావిప్లవం. ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేల ఖర్చు.. ‘మన ఊరు -మన బడి’తో సర్కార్ స్కూళ్లకు సకల వసతులు జిల్లాకో మెడికల్ కలాశాల, 2 లక్షల 25 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలతో యువతకు బంగారు భవితను అందిస్తున్న సీఎం కేసీఆర్. పల్లె పట్టణ ప్రగతితోపల్లెలు మెరిసిపోతున్నాయి. పక్కాగా రోడ్లు ఊరికో ట్రాక్టర్, ట్రాలీ, నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా కేంద్రాలు, స్వచ్ఛత జాతీయ అవార్డులు. మురిసి పోతున్న పట్టణాలు పార్కులు ట్యాంక్ బండ్లు ఓపెన్ జిమ్‌లు సెంట్రల్‌లైటింగ్ చౌరస్తాలు ఇలా ఎన్నో చేసి పల్లెలను సిరిమల్లెలుగా, పట్టణాలను ప్రగతి కేంద్రాలుగా మలచిన సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు.
ధరల పెరుగుదల .. మోదీ వైఫల్యం
అడ్డూ అదుపులేని విధంగా ధరల పెరుగుదల , మోదీ ప్రభుత్వ విధానాలే కారణం. సిలిండర్ రూ.400 నుంచి రూ1200 వరకు పెంపు, పెట్రోల్ ధరలను రూ. 70 నుంచి 115 వరకు పెంపు. పెట్రోల్, డీజిల్‌పై రూ. 30 లక్షల కోట్ల సెస్సులు విధించిన కేంద్రం. ఫలితంగా రవాణా వ్యయం, ఉత్పత్తి ఖర్చు పెరిగి పప్పులు ఉప్పులు రేట్లు భగ్గుమన్నాయి. డీజిల్ ధర పెరగడం వల్ల రైతు ఖర్చులు రెట్టింపయ్యాయి. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిబంధనలు పెట్టడం వల్ల కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జిలను వినియోగ దారులపై వేయకుండా భరిస్తుంది. సామాన్యుడి బతుకు బండిపై ధరల దాడిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిలిండర్ సబ్సిడీ పునరుద్ధరించాలని పెట్రోల్ పై సెస్సులు పూర్తిగా ఎత్తివేయాలని కొరుతూ తీర్మానం చేస్తారు.
నియోజకవర్గ కేంద్రాల్లో ప్లీనరీ సమావేశాలు
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అదే రోజు ఉదయం ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేస్తాం. మూడు జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు సమన్వయంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నవారు, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అట్టహాసంగా ప్లీనరీ వేడుకలు నిర్వహించనున్నాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 22 ఏండ్ల పార్టీ ఆవిర్భావం, 9 ఏండ్ల ప్రగతి ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని దేశ ప్రజలు నేడు కోరుకుంటున్నారు. ఆ దిశగానే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసుకుంటున్నాం.
-తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయండి
ఈ నెల 25న శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేద్దాం. గ్రామ స్థాయి నుంచి మం డల, రాష్ట్ర స్థాయి నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా హాజరుకావాలి. ఆరోజు గ్రామాల్లో జెండా ఎగురవేసి, నియెజకవర్గ కేం ద్రాల్లో జరిగే ప్లీనరీలకు హాజరుకావాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్లీనరీలో చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలవద్దకు తీసుకవెళ్తాం. ఆదిశగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో హాట్రిక్ కొడుతుంది. ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు ఎన్ని చెప్పినా ఇవ్వాల ప్రజలు నమ్మరు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి.
-కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షడు, మెదక్ ఎంపీ