కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఎల్ఆర్ఎస్ ఉచితమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది.. అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని, ఇప్పుడు మాటమార్చి గడువు విధిస్తూ రుసుము కట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వడంపై వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. జనం పక్షాన నిలిచి ధర్నా చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజలు మద్దతు పలికారు.