సంగారెడ్డి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): పంటరుణమాఫీ అమలులో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గురువారం సంగారెడ్డి జిల్లా అంతటా ధర్నాలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష నుంచి రెండు లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ప్రభుత్వం రైతులందరికీ వందశాతం పంట రుణమాఫీ అమలు చేయలేదు.
దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. సం గారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో 97 566 మంది రైతులకు రూ.842.40 కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. జిల్లాలో అర్హులైన రైతులందరికీ పంట రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు పంట రుణమాఫీ చేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు అధికారులను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు పంట రుణమాఫీ కాలేదంటూ ఐదు వేల మందికిపైగా రైతులు ఫిర్యాదులు చేశారు.
వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్యరోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ జిల్లా అం తటా ధర్నా నిర్వహించనున్నది. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకు లు పాల్గొననున్నారు. ధర్నాలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులను కోరారు.