గజ్వేల్, ఆగస్టు 16: రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో యూరియా కోసం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే రైతులు క్యూలో నిలబడినా యూరియా దొరకడం లేదన్నారు. రైతు వ్యతిరేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం త్వరలోనే రైతులు చెబుతారని అన్నారు. 24 కరెంట్, యూరియా, విత్తనాల సరఫరాలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గజ్వేల్‌లో కేసీఆర్ రేక్ పాయింట్ ఏర్పాటు చేసి యూరియాను ఇతర జిల్లాలకు సరఫరా చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రేక్ పాయింట్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించి యూరియాను తేవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే గజ్వేల్‌లో రేక్ పాయింట్‌ను పునరుద్ధ్దరించాలని, ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు గతంలో మాదిరిగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గ రైతులకు సరిపడా వారం రోజుల్లోగా యూరియాను సరఫరా చేయకపోతే వేలాది మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని, వంటావార్పు చేపడతామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులున్నా జిల్లా రైతులకు సాగునీళ్లను ప్రభుత్వం ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా బయపడమని, రైతుల పక్షాన పోరాటాన్ని ఆపబోమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
ధర్నా వద్దకు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి చేరుకుని మాట్లాడారు. జిల్లాకు ఇప్పటి వరకు 26,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. ఆర్ఎఫ్సీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి యూరియా ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు వస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని అన్నారు.వర్షం కారణంగా గజ్వేల్‌కు 75మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలో ఆలస్యం జరిగిందని, మూడునాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని ఆమె తెలిపారు
రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా విషయం తెలిసి 300 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. పోలీసులు రిమ్మనగూడ రింగ్‌రోడ్డు వద్ద వాహనాలను పిడిచేడ్, తొగుట మీదుగా సిద్దిపేటకు, గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద రాయవం, మునిగడప, జగదేవ్‌పూర్ మీదుగా ప్రజ్ఞాపూర్ వైపు మళ్లించారు. ధర్నాకు వస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆయా ప్రదేశాల వద్ద అడ్డుకున్నారు.
రాయపోల్, ఆగస్టు 16: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్, దౌల్తాబాద్ మండలాల రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. యూరియా వస్తుందన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు రాయపోల్‌లోని ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాప్ వద్ద ఉదయం 6 గంటల నుంచే వర్షంలో గొడుగులు పట్టుకొని బారులు తీరారు. క్యూలో నిల్చుని ఇబ్బందులు పడ్డారు. ఆగ్రోస్ కేంద్రానికి 560 బస్తాల యూరియా, యాదాద్రి ఫర్టిలైజర్ షాప్‌నకు 300 బస్తాల యూరియా రావడంతో మండల వ్యవసాయాధికారి నరేశ్ ఆధ్వర్యంలో ఒకో రైతుకు 2 బస్తాల చొప్పన పంపిణీ చేశారు. చాలామంది
రైతులకు యూరియా దొరకక నిరాశతో వెనుదిరిగారు.
వెల్దుర్తి, ఆగస్టు 16: ఓవైపు కురుస్తున్న ముసురు… చల్లని గాలులు వీస్తున్నా… రైతన్నలకు యూరియా గోస తప్పడం లేదు. శనివారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తిలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద ముసురు లోనూ యూరియా కోసం రైతులు వరుసలో నిరీక్షించారు. పీఏసీఎస్ ఎరువుల దుకాణం తెరువక ముందు ఉదయం తొమ్మిది గంటల నుంచే రైతులు లైన్లో నిల్చున్నారు. సిబ్బంది వచ్చిన తరువాత పట్టాపాసు పుస్తకాలను పరిశీలించి, ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా అందజేశారు.
చేగుంట, ఆగస్టు 16: మెదక్ జిల్లా చేగుంటలో శనివారం యూరియా కోసం రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల పాటు క్యూలో నిలుచున్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఓ ఫర్టిలెజర్ షాపునకు శనివారం రెండు వందల బస్తాల యూరియా రాగా, సుమారు 500 మంది రైతులు ఉదయమే చేరుకున్నారు. కనీసం ఒక బస్తా యూరియా దొరుకుతుంది అని రైతులు క్యూలో నిలుచున్నారు. పోలీస్ పహారాలో ఆధార్, పట్టా పాస్‌బుక్ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా పంపిణీ చేశారు. సగం మంది రైతులకు యూరియా లభించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇబ్రహీంపూర్ సహకార సంఘం కార్యాలయం వద్ద జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లైన్లో నిలుచున్నారు. ఇక్కడ సగం మంది రైతులకు యూరియా దొరకలేదు.